హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 2026, మార్చి 16న మొదలైన అసెంబ్లీ బడ్జెట్ సెషన్ సోమవారం (మార్చి 30)తో ముగిసింది. మొత్తం 10 రోజుల పాటు సభ నడవగా అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సోమవారం (మార్చి 30) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఈ సెషన్‌లో అసెంబ్లీ మొత్తం 82 గంటల 47 నిమిషాల పాటు పని చేసింది.
గిగ్ వర్కర్స్ బిల్లు, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు వంటి 10 ముఖ్యమైన బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. హేట్ స్పీచ్ బిల్లును ప్రభుత్వం సెలక్ట్ కమిటీకి సిఫార్సు చేసింది. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రజా సమస్యలు, బడ్జెట్ కేటాయింపులపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీగా చర్చ నడిచింది.
