Phones Theft In RCB Match: RCB vs SRH మ్యాచ్‌లో గందరగోళం.. చిన్నస్వామి స్టేడియంలో ఫోన్ల చోరీ

Phones Theft In RCB Match: RCB vs SRH మ్యాచ్‌లో గందరగోళం.. చిన్నస్వామి స్టేడియంలో ఫోన్ల చోరీ

Phones Theft In RCB Match: బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం (2026, మార్చి 29) జరిగిన ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్ ఉత్సాహాన్ని నింపిగా.. మరోవైపు అనేక మంది అభిమానులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన ఈ పోరును చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల మొబైల్ ఫోన్లు భారీగా చోరీకి గురయ్యాయి. స్టేడియంలో మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో, దొంగలు చేతివాటం ప్రదర్శించారు. స్టేడియం లోపల వివిధ సెక్షన్లతో పాటు ఎంజీ రోడ్, కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ పరిసరాల్లోనూ ఫోన్లు మాయమైనట్లు అనేక ఫిర్యాదులు వచ్చినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. జనం మ్యాచ్‌పై దృష్టి పెట్టిన తరుణంలో దొంగలు జేబులు, బ్యాగుల నుంచి ఫోన్లను కాజేశారు.

18 లక్షల విలువైన ఫోన్లు రికవరీ: 
వరుస ఫిర్యాదులతో అప్రమత్తమైన బెంగళూరు పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు రూ. 18 లక్షల విలువైన 21 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో మైనర్లు కూడా ఉండటం గమనార్హం. వీరంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక పెద్ద ముఠా సూచనల మేరకు ఈ దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది. తప్పించుకున్న దొంగల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బెంగళూరు పోలీసులు వెల్లడించారు.

అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక: 
గత ఏడాది ఆర్సీబీ టైటిల్ గెలిచిన సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనతో స్టేడియం దగ్గర భద్రతపై మళ్లీ ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పెద్ద ఎత్తున జనం ఉండే ప్రాంతాల్లో విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఇక ఫోన్ల చోరీ ఘటనని పక్కన పెడితే, మైదానంలో మాత్రం ఆర్సీబీ అదరగొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 201/9 పరుగులు చేయగా.. కెప్టెన్ ఇషాన్ కిషన్ (80), అనికేత్ వర్మ (43) రాణించారు. 202 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించింది. విరాట్ కోహ్లీ (69 నాటౌట్), దేవ్‌దత్ పడిక్కల్ (61) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.