మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. పన్ను చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న మొండి బకాయిదారుల ప్రాపర్టీలను సీజ్ చేస్తూ మున్సిపల్ యంత్రాంగం దూకుడు పెంచింది.
ఇప్పటి వరకు ఆస్తి పన్ను చెల్లించని 75 ప్రాపర్టీలను అధికారులు సీజ్ చేశారు. భారీగా బకాయిలు ఉన్న మరో 677 ప్రాపర్టీలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా(మార్చి31) గడువు ముగియనుందని పన్ను చెల్లించని పక్షంలో మరిన్ని సీజ్‌లు తప్పవని అధికారులుహెచ్చరించారు.
మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా వడ్డీపై 90 శాతం మాఫీ పొందే అవకాశం మార్చి 31తో ముగియనుందని తెలిపారు. చివరి తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వడ్డీ మాఫీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి వడ్డీతో సహా పన్ను వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తామని ప్రకటించారు.
మున్సిపల్ ఆదాయానికి గండికొడుతున్న వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని అధికారులు పిలుపునిచ్చారు. జరిమానాలు, సీజ్‌ల నుంచి తప్పించుకోవాలంటే వెంటనే పన్ను చెల్లించాలని బకాయిదారులకు సూచిస్తున్నారు.
