పాపం ఢిల్లీకే ఎందుకిలా.. రెండు సీజన్లు.. ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఔట్

పాపం ఢిల్లీకే ఎందుకిలా.. రెండు సీజన్లు.. ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఔట్

ఐపీఎల్‎లో ఢిల్లీ క్యాపిటల్స్ కు మరోసారి బిగ్ షాక్ తగిలింది. గత సీజన్ లో ఢిల్లీ జట్టుఎన్నో ఆశలు పెట్టుకున్న హ్యారీ బ్రూక్ ఐపీఎల్ నుంచి తప్పుకోగా.. తాజాగా మరో ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ డకెట్ కూడా ఐపీఎల్ ఆడట్లేదని స్పష్టం చేశాడు. ఇద్దరినీ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేయడం.. అదేవిధంగా ఇద్దరూ కూడా ఇంగ్లాండ్ క్రికెటర్లు కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

బ్రూక్ సంగతి పక్కన పెడితే డకెట్ తాను ఐపీఎల్ నుంచి ఎందుకు తప్పుకుంటున్నాడో క్లారిటీ ఇచ్చాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్ లో ఘోరంగా విఫలమైన ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ ఇకపై జాతీయ జట్టుపై ఎక్కవగా ఫోకస్ చేయనున్నట్టు చెప్పాడు. తన టెస్ట్ కెరీర్‌ను కాపాడుకోవడానికే డకెట్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. 

ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ లో బెన్ డకెట్ ను 2 కోట్ల రూపాయలకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది. విదేశీ ఓపెనర్ గా జట్టులో పనికొస్తాడని భావించి ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ కు అవకాశం ఇచ్చింది. అయితే డకెట్ కు ప్లేయింగ్ 11లో అవకాశాలు దక్కే అవకాశాలు దాదాపుగా లేవు. 

2026 టీ20 వరల్డ్ కప్ మొత్తం బెంచ్ కే పరిమితమైన ఈ అగ్రెస్సివ్ బ్యాటర్..ఐపీఎల్ లో కూడా రెండు నెలల పాటు డగౌట్ కు పరిమితం కాక తప్పదు. ఎందుకంటే ఢిల్లీ జట్టు ఆడే నలుగురు విదేశీ ప్లేయర్లలో మిచెల్ స్టార్క్ తో పాటు ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్ ఉంటారు. ఒక విదేశీ ఓపెనర్ కోటాలో డకెట్ కంటే శ్రీలంక ఓపెనర్ పాతున్ నిస్సంక ముందు వరుసలో ఉన్నాడు. 

దీంతో డకెట్ కు ప్లేయింగ్ 11లో ఛాన్స్ ఉండడం కష్టం. ఐపీఎల్ రూల్స్ ప్రకారం టోర్నీ అయిపోయేవరకు జట్టులోని ఉండాలి. ఖాళీగా జట్టుతో ఉండే బదులు ఇంగ్లాండ్ వెళ్లి ప్రాక్టీస్ చేసుకుంటే ఫామ్ లోకి అయినా రావొచ్చనే ఉద్దేశ్యంతో ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ ఐపీఎల్ ను వదిలేసినట్టు తెలుస్తుంది. 

ఇప్పుడు డకెట్ ఐపీఎల్ కెరీర్ ప్రమాదంలో పడింది. ఫారెన్ ప్లేయర్ ఎవరైనా తమంతటా తాము తప్పుకుంటే బీసీసీఐ రెండేళ్ల పాటు ఈ మెగా లీగ్ ఆడకుండా నిషేధం విదిస్తుంది. గత సీజన్ లో బ్రూక్ కూడా జాతీయ జట్టు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ ఆడకూడదని నిర్ణయించుకోవడంతో రెండేళ్ల నిషేధం పడింది. 

అయితే బ్రూక్ యంగ్ ప్లేయర్ కావడంతో ఇంకా చాలా కెరీర్ ఉంది. కానీ 31 ఏళ్ళ డకెట్ కు మాత్రం మరోసారి ఐపీఎల్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. బీసీసీఐ డకెట్ ను నిషేధిస్తే అప్పటికి అతని వయసు 33కు చేరుతుంది. దీంతో ఈ ఇంగ్లీష్ ఓపెనర్ పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించకపోవచ్చు. 

డకెట్ ఐపీఎల్ బదులుగా కౌంటీ ఛాంపియన్‌షిప్ సీజన్ ప్రారంభ మ్యాచ్ లకు నాటింగ్‌హామ్‌షైర్ తరఫున ఆడి ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులో స్థానం సంపాదించుకునే పనిలో ఉన్నాడు. వయసు 31 కావడంతో ఐపీఎల్‌ కెరీర్ కు దాదాపు ఎండ్ కార్డు పడినట్టే. అయితే ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ మాత్రం ఏదో ఒక రోజు ఢిల్లీకి ఆడతానని.. ప్రస్తుతం తన దృష్టంతా జాతీయ జట్టుపైనే ఉందని తెలిపాడు.