చెన్నై: టీవీకే పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు మొత్తం రూ.615 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. 2026, ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ చెన్నైలోని పెరంబూర్‌తో పాటు, సెంట్రల్ తమిళనాడులోని తిరుచ్చి ఈస్ట్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం (మార్చి 30) పెరంబూర్‌లో విజయ్ నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ అఫిడవిట్లో తనకు మొత్తం రూ.615 కోట్ల ఆస్తులు ఉన్నట్లు విజయ్ ప్రకటించారు. ఇందులో రూ.405 కోట్ల చరాస్తులు, రూ. 210 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం విజయ్ ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నామినేషన్ దాఖలు చేసిన డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు విజయ్. తమిళనాడు ప్రస్తుత దుస్థితికి అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)నే కారణమని.. స్టాలిన్ సర్కార్ అన్నింట్లో విఫలమైందని విమర్శించారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో లగ్జరీ లైఫ్ ను వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.
నిజాయితీగా, నిబద్ధతతో ఉంటానని.. తమిళనాడు ప్రజలను ఎన్నిటికీ మోసం చేయనని అన్నారు. డీఎంకే ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కాకుండా ప్రజా సంక్షేమం కోసం పరితపించే టీవీకే పార్టీని ఎన్నుకోవాలని ఓటర్లుకు పిలుపునిచ్చారు. బ్యాలెట్ ద్వారా విజిల్ విప్లవం తీసుకురావాలన్నారు.
మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 2026, ఏప్రిల్ 23 ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఇప్పటికే 234 స్థానాలకు విజయ్ తన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు.
తమిళనాడులో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోన్న బీజేపీ విజయ్‌తో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఇందుకు విజయ్ ఒప్పుకోలేదు. ఒంటరిగా పోటీ చేసేందుకే మొగ్గు చూపాడు. దీంతో ఈసారి తమిళనాడులో త్రిముఖ పోరు నెలకొంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి, టీవీకే మధ్య ట్రయాంగిల్ ఫైట్ సాగనుంది.
