Shreyas Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే కీలక పోరుకు ముందు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నాడు. నెట్స్ ప్రాక్టీస్‌లోనే కాకుండా, మైదానం బయట కూడా తన అథ్లెటిసిజంతో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. కాగా, ఇటీవల పంజాబ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో శ్రేయస్ ఫుట్‌బాల్‌తో 'కీపీ-అప్' (Keepy-up) ఛాలెంజ్ చేశాడు. అతనికి ఇచ్చిన టార్గెట్ 60 కాగా, అయ్యర్ ఏకంగా 87 సార్లు బంతి కింద పడకుండా ఆపి అందరినీ ఫిదా చేశాడు. ఈ వీడియోపై స్పందించిన పంజాబ్ కింగ్స్.. "కొన్ని కాదు.. అన్ని 87లు 60ల కంటే మెరుగైనవే!" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. భారత ఫుట్‌బాల్ క్రీడాకారుడు అమేయ్ రనవాడ కూడా ఈ వీడియోపై స్పందిస్తూ శ్రేయస్ నైపుణ్యాన్ని మెచ్చుకున్నాడు.
టీమిండియాలో తిరిగి చోటు సంపాదించడమే లక్ష్యంగా శ్రేయస్ అయ్యర్ ఈ ఐపీఎల్ బరిలోకి దిగుతున్నాడు. అతను అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడి దాదాపు మూడు ఏళ్లు దాటిపోయింది. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుతంగా రాణించినప్పటికీ, భారత తుది జట్టులో అతనికి అవకాశం దక్కలేదు. టీ20 వరల్డ్ కప్‌కు ముందు న్యూజిలాండ్ సిరీస్‌లో తిలక్ వర్మకు బ్యాకప్‌గా ఎంపికైనప్పటికీ, ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.
కాగా ప్రస్తుతం భారత టీ20 జట్టులో విపరీతమైన పోటీ ఉంది. పంజాబ్ కింగ్స్ జట్టుని కెప్టెన్‌గా ముందుండి నడిపించడమే కాకుండా, బ్యాటర్‌గా భారీ స్కోర్లు సాధిస్తేనే బీసీసీఐ సెలక్టర్ల దృష్టిలో పడే అవకాశం ఉంది. అయితే శ్రేయస్ అయ్యర్ గత ఏడాది ఫామ్‌ను ఈసారి లీగ్ మ్యాచ్‌ల్లోనూ కొనసాగిస్తాడా అనేది వేచి చూడాలి.
