- రోహిత్ శర్మపైనే అందరి కళ్లు
- సుందర్ ప్లేస్‌లో హర్ష్ దూబే
- మ. 3.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో లైవ్
లండన్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ క్లైమాక్స్‌కు చేరింది. ఆదివారం లార్డ్స్‌లో జరిగే ఆఖరిదైన మూడో వన్డేలో గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకోవాలని ఇరుజట్లు ప్రయత్నిస్తున్నాయి. అయితే సిరీస్ విజయం కంటే టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. హిట్‌మ్యాన్ కెరీర్‌లో ఇదే ఆఖరి మ్యాచ్ అని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రోహిత్‌కు ఇది ఆఖరి మ్యాచ్ కాదని బీసీసీఐ స్పష్టం చేయడంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరీ పీల్చుకున్నారు.
కానీ గత రెండు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోరుకు పరిమితమైన హిట్‌మ్యాన్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా రాణించి ఫామ్‌ను నిరూపించుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. సౌతాఫ్రికాలో జరిగే 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ జట్టులో కొనసాగాలంటే.. లార్డ్స్‌లో తడాఖా చూపెట్టాల్సిన సమయం వచ్చేసింది. తొలి పది ఓవర్లలో ఇంగ్లిష్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేగాన్ని తట్టుకుని నిలబడటం రోహిత్‌కు ప్రధాన సవాలుగా మారింది. ఈ మ్యాచ్‌లో దీన్ని అధిగమిస్తాడో లేదో చూడాలి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భారీ స్కోరుపై కన్నేయగా, విరాట్ కోహ్లీ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం.
కేఎల్ రాహుల్ ప్లేస్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ షార్ట్ పిచ్ బాల్స్‌ను ఎదుర్కోవడంలో తడబడుతున్నాడు. మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లిష్ స్పిన్నర్లకు సవాలు విసురుతున్నాడు. వీళ్లంతా బ్యాట్లు ఝుళిపిస్తే భారీ స్కోరు ఖాయం. బౌలింగ్‌లో ఒక్క మార్పు చోటు చేసుకోవచ్చు. రెండో వన్డేలో హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన స్పిన్నర్ సుందర్ ప్లేస్‌లో హర్ష్ దూబేను తుది జట్టులోకి తీసుకోనున్నారు. జడేజా లేని లోటును అక్షర్ పటేల్ తీరుస్తుండటం ఇండియాకు బలంగా మారింది. పిచ్ పరిస్థితులను బట్టి కుల్దీప్ యాదవ్‌ను తీసుకునే అవకాశం లేకపోలేదు.
రూట్‌పైనే భారం..
ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ కూడా రెండు మార్పులను చేసే అవకాశం ఉంది. టీ20 ఫైనల్స్ కోసం టామ్ బాంటన్, లియామ్ డాసన్‌ను జట్టు నుంచి రిలీజ్ చేశారు. కాబట్టి వాళ్లు లార్డ్స్‌లో ఆడే చాన్స్ లేదు. సాకిబ్ మహమూద్ ప్లేస్‌లో జోష్ టంగ్ జట్టులోకి రావచ్చు. ఇక ఇంగ్లండ్ బ్యాటింగ్ మొత్తం రూట్‌పైనే ఆధారపడటం మైనస్‌గా కనిపిస్తోంది.
డకెట్, బెథెల్, బ్రూక్, బట్లర్ బ్యాట్లు ఝుళిపించాల్సిన సమయం వచ్చేసింది. బౌలింగ్‌లో సామ్ కరన్, విల్ జాక్స్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. బ్యాటర్లందరూ ఫామ్‌లోకి రావడంతో పాటు ఆర్చర్ మరోసారి చెలరేగితే ఇంగ్లండ్‌ను ఆపడం అసాధ్యం. ఓవరాల్‌గా ఇంగ్లిష్ బౌలింగ్‌కు ఇండియా బ్యాటింగ్‌కు మరో రసవత్తరమైన సమరం మాత్రం సాగనుంది.
తుది జట్లు (అంచనా)
ఇండియా: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్ / హర్ష్ దూబే, బుమ్రా, గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణ.
ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, బట్లర్, సామ్ కరన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, ఆర్చర్ / జోష్ టంగ్ / సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్.
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అనుకూలం. సమయం గడిచేకొద్ది పిచ్ జిగటగా మారే అవకాశం ఉంటంతో తొలుత బ్యాటింగ్ చేయడం ప్రధానం. 2017 తర్వాత ఛేజింగ్ చేసిన జట్టు గెలవలేదు.
