హైదరాబాద్ పంజాగుట్టలో హనీట్రాప్ కలకలం రేపింది. ఒక ప్రభుత్వ ఉన్నతాధికారిని మూడేళ్లుగా బ్లాక్‌మెయిలింగ్ చేస్తూ డబ్బులు వసూలు చేసింది. ఫోటోలు, వీడియోలు కాకుండా ఓయో రూమ్ బిల్లులు చూపిస్తూ మహిళ బెదిరింపులకు పాల్పడింది.
ఖైరతాబాద్ రేషన్ సర్కిల్ కార్యాలయంలో కీలక అధికారిగా పనిచేస్తున్న వ్యక్తిని ఒక మహిళ పరిచయం చేసుకుంది. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని, పక్కా ప్లాన్‌తో హనీట్రాప్‌లోకి దించేసింది. అంతటితో ఆగకుండా.. ఆ అధికారితో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను చూపిస్తూ బ్లాక్‌మెయిలింగ్ కి తెరలేపింది. మరింత పక్కాగా బుక్ చేయడానికి ఓయో రూమ్ స్లిప్పులను కూడా తన వద్దే పెట్టుకుని, వాటిని బయటపెడతానంటూ గత మూడేళ్లుగా సదరు అధికారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ వస్తోంది.
ఆ మహిళ వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోవడంతో, తట్టుకోలేకపోయిన ఆ ప్రభుత్వ అధికారి చివరకు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు.. నిందితురాలిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. అటు ప్రభుత్వ అధికారి హనీట్రాప్ కావడం, ఇటు ఓయో స్లిప్పులతో బెదిరింపులకు పాల్పడటం హాట్ టాపిక్‌గా మారింది.
