హైదరాబాద్ వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్ఈ) అధికారులను రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో గవర్నర్ తో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి భేటీ అయ్యారు. వర్సిటీల్లో అమలు చేస్తున్న సంస్కరణలపై గవర్నర్ సుదీర్ఘంగా సమీక్షించారు. తెలంగాణను దేశంలోనే టాప్ విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
త్వరలోనే వీసీలు, కౌన్సిల్ అధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. వర్సిటీల్లోని లోపాలను సరిదిద్ది, వాటిని బలోపేతం చేసేందుకు పాలసీ పరమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. రైజింగ్ తెలంగాణ విజన్-2047, వికసిత భారత్-2047 ఆశయాలకు అనుగుణంగా ఉన్నత విద్యలో స్పష్టమైన మార్పులు రావాలని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి వర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుని తెలంగాణను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలని గవర్నర్ పేర్కొన్నారు.
