- ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్లకు గవర్నర్ శుక్లా సూచన
హైదరాబాద్, వెలుగు: ప్రజలకు అంకితభావంతో సేవలు అందించాలని ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఎంసీహెచ్ఆర్ డీ లో శిక్షణ పొందుతున్న 44 మంది గ్రూప్-1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు డీజీ శాంతికుమారి ఆధ్వర్యంలో సోమవారం లోక్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లను గవర్నర్ అభినందించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి నిర్ణయంలో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యం కావాలన్నారు.
“పరిపాలనలో నిజాయితీ మీ గొప్ప బలం. అది ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రతి పౌరుడి సమస్యను సున్నితంగా అర్థం చేసుకుని పరిష్కారం చూపాలి. పదవి ఒక అధికారం మాత్రమే కాదు, అది ఒక బాధ్యత అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. రాష్ట్రాభివృద్ధికి, సమాజ పురోగతికి కీలకంగా మారాలి” అని గవర్నర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దానకిశోర్, సంయుక్త కార్యదర్శి శశి
కిరణా చారి పాల్గొన్నారు.
సరస్వతీ అంత్య పుష్కరాలకు రండి: గవర్నర్ కు దేవాదాయ శాఖ ఆహ్వానం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి ప్రారంభంకానున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను దేవదాయ శాఖ ఆహ్వానించింది. మంత్రి కొండా సురేఖ, ఆలయ అర్చకులు గవర్నర్ ను లోక్ భవన్‌లో సోమవారం కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. కాగా.. తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల్లో రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థిని మల్లాడి రుషిని గవర్నర్ సోమవారం లోక్ భవన్ లో అభినందించారు. ఆమె కృషి, పట్టుదలతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారం కూడా అభినందనీయమన్నారు.
