కేంద్రం కీలక నిర్ణయం: ఇక సింగిల్ యూజ్‌ ప్లాస్టిక్ తయారీపై బ్యాన్

కేంద్రం కీలక నిర్ణయం: ఇక సింగిల్ యూజ్‌ ప్లాస్టిక్ తయారీపై బ్యాన్

న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెను సవాలుగా ప్లాస్టిక్ పొల్యూషన్‌ను కంట్రోల్ చేసేందుకు కొత్త రూల్స్ జారీ చేసింది. పలచగా ఉండి, ఒకసారి వాడి పడేసే కవర్లను (సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌) పూర్తిగా నిషేధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్లాస్టిక్‌ వేస్ట్ మేనేజ్‌మెంట్ అమెండ్‌మెంట్ రూల్స్ – 2021కు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కొత్త రూల్స్ ప్రకారం 2022 జులై 1 నుంచి ఎక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ చేయకుండా బ్యాన్ విధిస్తోంది. ప్లాస్టిక్ కవర్లు, స్పూన్లు, ప్లేట్లు, కప్పులు, డిస్పోజల్‌ ట్రేలు, గ్లాసులు, స్ట్రాలు వంటి వస్తువులతో పాటు పాలిస్టరెన్ తయారీతో పాటు విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం పైనా నిషేధం పెట్టాలని, దీనిపై సంబంధిత డిపార్ట్‌మెంట్స్, అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. 

కనీసం 120 మైక్రాన్లు ఉండాల్సిందే

ప్రస్తుతం పాలిథీన్ కవర్లు 50 మైక్రాన్లతో మార్కెట్‌లోకి వచ్చేందుకు అనుమతి ఉంది. అయితే వీటి వల్లే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎక్కువగా వస్తోందని భావిస్తున్న కేంద్రం.. వచ్చే ఏడాది చివరి కల్లా కనీసం 120 మైక్రాన్లు లేనిదే మార్కెట్‌లోకి రానీయకుండా చేయాలని నిర్ణయించింది. దశల వారీగా ఈ నిర్ణయాన్ని అమలు చేయనుంది. 2021 సెప్టెంబర్ 30 నుంచి మార్కెట్‌లోకి వచ్చే క్యారీ బ్యాగ్స్ 75 మైక్రాన్లు ఉండాల్సిందేనని కొత్త నోటిఫికేషన్‌లో పేర్కొంది. అంతకంటే తక్కువ మైక్రాన్ల కవర్ల తయారీపై బ్యాన్ విధించింది. 2022 డిసెంబరు నాటికి 120 మైక్రాన్లు ఉంటేనే మార్కెట్‌లోకి అనుమతిస్తుంది. దీని ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రాకుండా చేసేందుకు చర్యలు తీసుకోనుంది. అయితే నిర్ణయాల అమలు పక్కాగా జరిగేలా చూసేలా గ్రామ పంచాయతీల స్థాయి వరకూ అధికారులపై బాధ్యతలు అప్పగించింది.