- ఒక్క మోటార్ కూడా నడిచేటట్లు లేదు
- పంపులు, మోటార్ల డ్యామేజీపై సర్కారు గప్‌చుప్
- ఇప్పటికిప్పుడు బాగుచేసే పరిస్థితి లేదంటున్న ఇంజనీర్లు
- బయటపడుతున్న డిజైనింగ్ లోపాలు
- నిర్మాణం, నిర్వహణ లోపాలపైనా అనుమానాలు
- మోటార్లు మునిగి 26 రోజులైనా సమీక్ష చేయని ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యంగా చెప్పుకున్న రూ.లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నీటిలో మునిగిపోవడంతో రాష్ట్ర సర్కార్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. వరదలో చిక్కుకున్న ప్రాజెక్టు పంపులు, మోటార్లకు మైనర్ రిపేర్లు చేస్తే పని చేస్తాయని సర్కారు భావించినా.. కన్నెపల్లి పంప్ హౌస్ గోడలు కూలి, మోటార్లు పనికి రానంతగా దెబ్బతిన్నాయి. ఇప్పటికిప్పుడు పునరుద్ధరించే పరిస్థితి లేదని తేలడంతో తంటాలు పడుతున్నది. ఒక్క మోటార్ కూడా ఇప్పట్లో నడవదని ఇంజనీర్లు చెబుతున్నారు. దీంతో ఇంతకాలం చెప్పుకొచ్చిన క్రెడిట్ మొత్తం కొట్టుకుపోయిందని ప్రభుత్వం డైలమాలో పడింది. మరోవైపు ప్రభుత్వం ఈ ఘటనపై ఇప్పటివరకు సమీక్ష చేయకపోగా.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏమైంది.. ఎంత డ్యామేజీ జరిగిందనే వివరాలపై కనీసం ప్రకటన కూడా చేయలేదు. పంపులు మునిగి 26 రోజులైనా.. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈఎన్సీ కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌస్‌ల వద్దకు వెళ్లలేదు. జనం అటువైపు వెళ్లకుండా పోలీసులను మోహరించటం, ఆంక్షలు విధించటం కూడా అనుమానాలకు తావిస్తున్నది. సంఘటన జరిగిన వారం రోజులకే ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్‌కుమార్ మాట్లాడుతూ.. కాళేశ్వరం పంపులకేం కాలేదని, కేవలం రూ.25 కోట్లతో రిపేర్లు పూర్తవుతాయని, వీటిని కాంట్రాక్టు కంపెనీనే భరిస్తుందని చెప్పారు. కానీ పంపులు తేలిన కొద్దీ నష్టం వందల కోట్లకు చేరుతుండటంతో సర్కారు చిక్కుల్లో పడింది. మళ్లీ వరద వస్తే పంపులు మునిగిపోవనే గ్యారంటీ లేదని రిటైర్డు ఇంజనీర్లు చెబుతున్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ డిజైనింగ్‌లోనే లోపం ఉందని ఇంజనీర్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కేవలం డిజైనింగ్ లోపమా, నిర్మాణంలోనూ లోపముందా, పనుల నాణ్యత విషయంలో రాజీపడ్డారా, నిర్లక్ష్యంగా వ్యవహరించారా? అనే విషయాలు సమగ్ర దర్యాప్తు జరిగేతే కానీ తేలవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గోదా వరి తీరం నుంచి మరికొంత దూరంలో పంప్ హౌజ్ నిర్మిస్తే ఈ ముప్పు తప్పేదని కొందరు నిపుణులు అంటున్నారు. అందుకే ఇప్పుడున్న ప్రొటెక్షన్ వాల్‌ను వరదను తట్టుకునేలా మరోచోట నిర్మించటం లేదంటే.. పంపులను మరింత ఎత్తుకు మార్చాలనే ప్రత్యామ్నాయాలు ఇంజనీర్లు పరిశీలిస్తున్నారు.
చెక్కు చెదరని దేవాదుల.. ఓ ఉదాహరణ
ఇంత భారీ వరద వచ్చినా కాళేశ్వరం దిగువన ఉన్న దేవాదుల పంప్‌హౌస్ చెక్కుచెదరలేదు. మేడిగడ్డకు దిగువన గోదావరి ఉధృతంగా ప్రవహించే చోట 18 ఏండ్ల కింద దేవాదుల పంప్‌హౌస్ నిర్మించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం వద్ద ఉన్న ఈ పంప్‌హౌస్‌ను నదీ తీరానికి దూరంగా 4మీటర్ల ఎత్తుతో నిర్మించారు. అందుకే అది సేఫ్టీ జోన్‌లో ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు. దాంతో పోలిస్తే కన్నెపల్లి పంప్‌హౌస్ డిజైన్ లోపం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. నదికి కేవలం 150 మీటర్ల దూరంలోనే ఫోర్ బే ఉండటంతో వరద తీవ్రతను తట్టుకోలేకపోయింది. అందుకే సివిల్ నిర్మాణాలన్నీ బేస్‌మెంట్ లెవల్ నుంచి దెబ్బ తిన్నాయి. ఫోర్ బేస్‌మెంట్ గోడలు కూ లటంతో పంపు హౌస్‌లోకి నీళ్లు చేరి మోటార్లన్నీ మునిగిపోయాయి. అందుకే వీటిని పునరుద్ధరించి నా టెంపరరీ ప్రయత్నమేనని ఇరిగేషన్ విభాగం చేతులెత్తేసింది. డిజైన్ లోపానికి తో డు నిర్మాణ వైఫల్యాలకు, నాణ్యతలో రాజీపడటానికి ఆస్కారం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
కీలకమైన కన్నెపల్లిలోనే లోపాలు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో గుండె లాంటిది కన్నెపల్లి (లక్ష్మి) పంప్‌హౌస్. అట్లాంటిది అక్కడే డిజైనింగ్ లోపాలుంటే ఈ భారీ ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకమనే ఆందోళన వ్యక్తమవుతోంది. మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం దగ్గర ప్రాణహిత, గోదావరి కలిసే త్రివేణి సంగమానికి దగ్గరలోనే దీన్ని నిర్మిచారు. నది తీరం నుంచి దాదాపు అర కిలోమీటర్ దూరంలో రూ.2,827 కోట్లతో కన్నెపల్లి పంప్‌హౌస్‌ను 150 మీటర్ల వెడల్పుతో కట్టారు. రోజుకు 3 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేసేందుకు రూ.640 కోట్ల విలువైన 17 మోటార్లను బిగించారు. భూమికి సుమారు 48 మీటర్ల లోతులో మోటార్లు అమర్చారు. తీరం నుంచి అప్రోచ్ కెనాల్ తవ్వి ముందుగా హెడ్ రెగ్యులరేటర్ నిర్మించి గేట్లు అమర్చారు. తీరం దగ్గర వరద తాకిడిని తట్టుకునేలా అప్రోచ్ కెనాల్‌కు రెండు వైపులా ప్రొటెక్షన్ వాల్ కట్టారు. హెడ్ రెగ్యులేటర్ గేట్లను తెరిస్తే ఫోర్ బేలోకి నీళ్లు చేరుతాయి. ఫోర్ బే లో 93.5 మీటర్ల వాటర్ ఉంటే పంప్‌లు ఆన్ చేసి వాటర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేయొచ్చు.110 మీటర్ల ఎత్తు ఫోర్ బే గోడలు నిర్మించారు. జులై 14న వచ్చిన వరద తాకిడికి ఈ గోడ పగిలిపోయింది. ఒక్కసారిగా నీళ్లన్నీ పంప్ హౌస్‌లోకి చేరి మోటార్లన్నీ మునిగిపోయాయి. పంప్ హౌస్‌ను రిపేర్ చేయాలంటే ముందుగా ఫోర్ బే బేస్‌మెంట్ పునర్నిర్మించాలి. దెబ్బతిన్న ఫోర్ బే గేట్లను సరిచేయాలి. అప్పటివరకు మోటార్లు రన్ అయ్యే పరిస్థితి లేదని ఇంజనీర్లు చెబుతున్నారు. గోదావరి హయ్యర్ ఫ్లడ్ లెవల్ అంచనా వేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నిర్మాణం జరిగిందని.. పంప్ హౌస్‌ను కనీసం 4మీటర్ల ఎత్తున నిర్మిస్తే ఈ ముప్పు తప్పేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కట్టిన తొలి ఏడాది నుంచే ముప్పు
కాళేశ్వరం ప్రాజెక్టులో మూడేండ్ల కిందటే ప్రమాద ఘంటికలు మోగాయి. 2019 జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తే.. సెప్టెంబర్ 3న కన్నెపల్లి పంప్ హౌస్‌లోకి వరద నీరు చేరింది. పంప్‌హౌస్‌లోని ప్రొటెక్షన్ వాల్ దెబ్బతినడంతో మోటార్లపై నీళ్లు పడి ఖరాబయ్యాయి. రెండో మోటార్ ఆన్ చేయగా గేట్ వాల్వ్ లీకై నీరు పైకి ఎగజిమ్మింది. వర్షపు నీటికి ఈ నీరు జత కలిసి పంపు హౌస్‌లోకి వచ్చాయి. మూడో టీఎంసీ పనులతో ప్రొటెక్షన్ వాల్ దెబ్బతినడం వల్ల ఇది జరిగింది. త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. గత ఏడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు అన్నారం పంప్ హౌస్ కూడా జలమయమైంది. సుందిళ్ల బ్యారేజీ గేట్లు ఎత్తటం, జల్లారం వాగు పొంగడంతో అన్నారం పంప్‌హౌస్‌కు వరద పోటెత్తింది. మోటార్లు పాక్షికంగా నీట మునిగిపోయాయి. నాసిరకం పనులపై ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోశాయి. దీంతో ప్రభుత్వం మోటార్లకు మరమ్మతులు చేయించింది. నిర్మాణం, నిర్వహణ లోపాలను అధికారులు అప్పుడే గుర్తించి అప్రమత్తమై ఉంటే.. ఇప్పుడు భారీ నష్టం తప్పేది.
మునిగే చోట అన్నారం
కన్నెపల్లికి ఎగువన నిర్మించిన అన్నారం (సరస్వతి) పంప్ హౌస్ రెండేండ్లలోనే 2సార్లు మునిగింది. కన్నెపల్లికి అన్నారం బ్యారేజీకి మధ్య 36 కి.మీ దూరం. దానికి ఎగువన 1.8 కి.మీ దూరంలోనే పెద్దపల్లి జిల్లాలో సుందిళ్ల బ్యారేజ్ నిర్మించారు. అన్నారం పంప్‌హౌస్ కట్టేటప్పుడు హై ఫ్లడ్ లెవల్‌ను పరిగణనలోకి తీసుకోలేదని, సుందిళ్ల గేట్లు పూర్తిగా ఎత్తినప్పుడల్లా అన్నారం పంప్ హౌస్ మునిగిపోయేలా డిజైనింగ్ లోపం ఉందని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. సుందిళ్లతో పాటు పక్కనే ఉన్న జల్లారం వాగు తీవ్రతను అంచనా వేయకుండా.. వరద తీవ్రత ఎక్కువగా ఉండే చోట ఈ పంప్‌హౌస్ కట్టడం పెద్ద పొరపాటని అంటున్నారు.

