మెహిదీపట్నం, వెలుగు: చారిత్రక గోల్కొండ కోటలో జగదాంబ మహంకాళి(ఎల్లమ్మ) అమ్మవారి బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి గురువారం మూడో పూజ ఘనంగా నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళా భక్తులు బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల సిగాలు, పోతురాజుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఏసీపీ విక్రమ్ దేవ్ కుటుంబ సమేతంగా వచ్చి, అమ్మవారికి 200 గ్రాముల వెండి గొడుగును కానుకగా సమర్పించారు. ఆలయ ఈవో వసంత, చైర్మన్ ఆకుల చంద్రశేఖర్ ఆయనను సత్కరించారు. రాబోయే ఆదివారం నాలుగో పూజ జరగనుందని, లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చైర్మన్ తెలిపారు.
