పౌరసత్వ సవరణ బిల్లు(CAA)కు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే మద్దతు తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి తన ఫేస్‌బుక్ పేజీలో ఓ మెసేజ్ ను పోస్టు చేశారు. ఎన్నికల్లో గెలిచామనే కారణంతో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడం సరికాదన్నారు. ఐకమత్యం, పారదర్శకత, సరళీకరణ ద్వారా విద్యార్థులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తే మరిన్ని ఎన్నికల్లో విజయం సాధించవచ్చన్నారు. విద్య, టెక్నాలజీ, మౌలిక వసతులను మెరుగుపరచడం… వివిధ వర్గాల మధ్య దూరాలను నిర్మూలిస్తే యువత మన దేశాన్ని మనం ఊహించిన దానికంటే ముందుకు తీసుకెళ్తుందన్నారు.
యువత వారికి ఏమి కావాలో చెబుతోందన్నారు భోగ్లే. గత 25 ఏళ్లుగా మనం మంచి జీవితాన్ని గడిపామన్నారు. యుద్ధాలు, సాంస్కృతిక వ్యత్యాసాల ద్వారా తర్వాత తరానికి అన్యాయం చేయడం సరైంది కాదన్నారు. వారిని సంతోషంగా, స్వేచ్చా ప్రపంచంలో.. లౌకిక రాజ్యంలో విహరించేలా చేద్దామన్నారు.
మరోవైపు నా పోస్టు ఎవరినైనా బాధిస్తే క్షమించండి అన్న భోగ్లే… ఇవి కేవలం నా వ్యక్తిగత ఆలోచనలు మాత్రమేనని చెప్పారు.

