గంటన్నర  కుండపోత

గంటన్నర  కుండపోత
  •  కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ జామ్​

గ్రేటర్ లో శుక్రవారం మధ్యాహ్నం వర్షం దంచికొట్టింది. 3 గంటల తర్వాత నల్లటి మేఘాలతో సిటీ అంతటా చీకట్లు అలముకున్నాయి. గంటన్నరపాటు ఏకధాటిగా వాన కురవడంతో మెయిన్​రోడ్లు, కాలనీలు చెరువులను తలపించాయి. ఆఫీసులు, కాలేజీలు, స్కూళ్ల నుంచి వచ్చే టైం కావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. కొన్ని కాలనీల్లోని ఇండ్లలోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు. ఇండ్ల ముందు నిలిపిన వాహనాలు, వస్తువులు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. అత్యధికంగా కీసరలో 10.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సిటీలో మరో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

హైదరాబాద్/సికింద్రాబాద్/మల్కాజిగిరి/పద్మారావునగర్/కుషాయిగూడ/కంటోన్మెంట్/జీడిమెట్ల/వికారాబాద్, వెలుగు :

వనస్థలిపురం, హయత్​నగర్​లోని విజయవాడ నేషనల్​హైవేపై నడుములోతున వరద నిలవడంతో హోం మినిస్టర్ వెహికల్స్​అందులో చిక్కుకున్నాయి. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి క్లియర్​చేశారు. అలాగే సికింద్రాబాద్ – అమీర్‌‌పేట వచ్చే రోడ్డులో కిలోమీటర్ల మేర ట్రాఫిక్​నిలిచింది. జీహెచ్ఎంసీ టోల్​ఫ్రీ నంబర్లకు శుక్రవారం మొత్తం 220 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో వర్షానికి ఆయా ప్రాంతాల్లో నీళ్లు నిలిచాయని 206, చెట్లు కూలాయని14 ఫిర్యాదులు ఉన్నాయి. డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి తార్నాక డివిజన్​లో డిప్యూటీ మేయర్​ మోతె శ్రీలతారెడ్డి పర్యటించారు. కంటోన్మెంట్​పరిధిలోని బోయిన్​పల్లి రామన్నకుంట చెరువు కట్ట తెగింది. దీంతో సమీపంలోని బాపూజీనగర్, చుట్టుపక్కల ప్రాంతాలు జలమయం అయ్యాయి. కుత్బుల్లాపూర్​లో వానలతో శుక్రవారం తెల్లవారుజామున ఓ ఇల్లు కూలిపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వికారాబాద్​లో మధ్యాహ్నం 12 తర్వాత భారీ వర్షం కురిసింది. 

వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం 
ప్రాంతాలు వర్షపాతం              (సెం.మీ.లలో)

కీసర                                                  10.2
ఇబ్రహీంపట్నం                               9.7
నేరేడ్‌మెట్                                       9.5
ఈస్ట్‌ ఆనంద్‌బాగ్                             7.3
మల్కాజిగిరి                                      6.7
తిరుమలగిరి                                     6.3
హయత్‌నగర్                                    6.2
ఏఎస్‌రావు నగర్                               6.0
చర్లపల్లి                                             5.9
అల్వాల్                                            5.8
వెస్ట్‌ మారేడ్‌పల్లి                               5.3
బేగంపేట                                          5.0