భూగర్భ జలాలు​​​​​​​ మా వల్లనే పెరిగినయ్ : హరీశ్​రావు

భూగర్భ జలాలు​​​​​​​ మా వల్లనే పెరిగినయ్  :  హరీశ్​రావు
  • కాల్వలను ఆధునీకరించినం.. చివరి ఆయకట్టు వరకు నీళ్లిచ్చినం: హరీశ్​రావు
  • పదేండ్లలో 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు క్రియేట్ చేసినం
  • చాలా రోజులు మాట్లాడిన తర్వాతే ప్రాణహిత రీఇంజనీరింగ్​కు వెళ్లినం
  • నిజానికి ప్రాజెక్టును మార్చాలని అనుకోలేదు
  • తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని సీడబ్ల్యూసీనే చెప్పింది
  • మేం తప్పు చేయలేదు.. చేస్తే చర్యలు తీసుకోండి
  • వైట్​పేపర్​ అంతా తప్పుల తడక అని విమర్శ

హైదరాబాద్, వెలుగు:  తమ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, మిషన్​ కాక తీయ వల్లే భూగర్భ జలాలు పెరిగాయని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. ఎస్సారెస్పీ ద్వారా ఉమ్మడి ఏపీలో ఎన్నడూ 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని, తాము కాల్వలను ఆధునీకరించి చివరి ఆయకట్టు వరకు నీళ్లిచ్చామని చెప్పారు. పదేండ్లలో మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ కింద 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు క్రియేట్ చేశామని, 31.50 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేశామని ఆయన తెలిపారు. ఇరిగేషన్​పై కాంగ్రెస్​ సర్కార్​ ప్రవేశపెట్టిన వైట్​పేపర్​ అంతా తప్పులతడక అని విమర్శించారు. శనివారం అసెంబ్లీలో హరీశ్​ మాట్లాడుతూ.. ఒక్క ప్రాజెక్టుకు నాలుగు సార్లు ఫౌండేషన్​ వేసిన చరిత్ర కాంగ్రెస్​ పార్టీదని విమర్శించారు.

 ‘‘2007–08లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టారు. రూ.168 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మొబిలైజేషన్ అడ్వాన్సు కింద రూ.1,400 కోట్లు బిల్లులు లేపారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడాన్ని కాగ్​ కూడా తప్పు పట్టింది. ప్రాణహిత ప్రాజెక్టు రీడిజైనింగ్​కు కేసీఆర్​ సబ్​ కమిటీ వేశారు. అందులో తుమ్మల కూడా సభ్యులుగా ఉన్నారు. చాలా రోజులు మాట్లాడి, విశ్లేషణలు చేసిన తర్వాతే రీ ఇంజనీరింగ్​కు వెళ్లాం. నిజానికి ప్రాజెక్ట్ మార్చాలని అనుకోలేదు. అప్పటి కాంగ్రెస్ ఏడేండ్లలో ఎలాంటి ప్రాజెక్ట్ అనుమతులు సాధించలేదు. 

మా ప్రభుత్వం ఏర్పడ్డ 4 రోజుల్లోనే ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని నాడు కేసీఆర్​ లేఖ రాశారు’’ అని ఆయన తెలిపారు. మిడ్​ మానేరు ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయిందంటున్నారని, కానీ, అప్పటికింకా ఆ ప్రాజెక్టు పూర్తే కాలేదన్నారు. అప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వం రూ.106 కోట్ల ఖర్చుతో ప్రాజెక్టును మొదలుపెడితే.. తాము అధికారంలోకి వచ్చాక రూ.775 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లిచ్చామని ఆయన అన్నారు. ‘‘మిషన్​ కాకతీయ వల్ల 15 లక్షల ఆయక ట్టు స్థిరీకరణ జరిగింది. నాడు వేల సంఖ్యలో చెరువులు తెగేవి. మిషన్ కాకతీయ వల్ల తగ్గాయి. ప్రాజెక్టుల ద్వారా నాడు నీళ్లు ఇవ్వొద్ద న్న నిబంధన ఉండేది. కానీ కేసీఆర్ ఆదేశాలతో 6,200 చెరువులను అనుసంధానం చేసినం. నాడు నేరం అయితే కేసీఆర్ కాలంలో వరం అయింది” అని తెలిపారు. 

సాధ్యం కాదన్నా నాడు ముందుకుపోయిన్రు

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్​ సాధ్యం కాదని, ఖర్చు వృ థా అవుతుందని నాడు ఉమ్మడి ఏపీలో నాటి సర్కారుకు మహారాష్ట్ర సీఎం లేఖ రాశారని హరీశ్​  అన్నారు. అయినా పట్టించుకోకుండా ప్రాణహితపై నాటి కాంగ్రెస్​ ప్రభుత్వం ముందుకు వెళ్లిందని చెప్పారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించేందుకు మహారాష్ట్రతో అనేకసార్లు సంప్రదింపులు జరిపామన్నారు. ‘‘తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవు అని నాడు సీడబ్ల్యూసీ (సెంట్రల్​ వాటర్​ కమిషన్​) కూడా చెప్పింది. 2007 నుంచి 2014 వరకు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వమే ఉన్నా.. ప్రాజెక్టుపై మహారాష్ట్రతో ఎలాంటి అగ్రిమెంట్లూ చేయలేకపోయింది. ప్రాజెక్టును మార్చేందుకు 3 వేల ఎకరాలు కాదు.. అసలు నీళ్లేవని సీడబ్ల్యూసీ అడిగింది. జలాశయాల సామర్థ్యం సరిపోదని కేంద్రం రిపోర్ట్​ చెప్పింది. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోనందుకు కాంగ్రెస్​ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాలి. మీ ఖర్చు వృథా కాకుండా మేము చేశాం. రంగారెడ్డి జిల్లాలో 6 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేలా పాలమూరు– రంగారెడ్డి మొదలు పెట్టాం. కాల్వలు తవ్వి నీళ్లు అందించాలి. ఉమ్మడి పాలనలో 9 జిల్లాలు వెనుకబడ్డాయి. అదే కాంగ్రెస్​ పాలనాతీరుకు ఉదాహరణ. మేం తప్పు చేస్తే చర్యలు తీసుకోండి. కానీ, మేం తప్పు చేయలేదు. భయపడేది లేదు’’ అని పేర్కొన్నారు. 

కాగ్​ నివేదికతో సెల్ఫ్​ గోల్​

కాళేశ్వరం విషయంలో సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్​ రావు మండిపడ్డారు. కాగ్​ నివేదిక మీద మాట్లాడితే కాంగ్రెస్​కే సెల్ఫ్​ గోల్​ అవుతుందని ఆయన అన్నారు. ‘‘చంద్రబాబు కాగ్ నివేదిక అశాస్త్రీయం అన్నారు. ఆ తర్వాత వైఎస్సార్​ కూడా తప్పుబట్టారు. కాగ్​ నివేదిక బైబిల్​, ఖురాన్​, భగవద్గీత కాదు అని కిరణ్ కుమార్​ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్​ కూడా కాగ్​ నివేదిక తప్పుల తడక.. ప్రామాణికత లేదని అన్నా రు. కేంద్ర ప్రభుత్వ వ్యాప్కోస్ చెబితేనే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును ప్రారంభించాం. ప్రస్తుత ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీకి కావాలనే రిపేర్లు చేయడం లేదు. మొత్తం కూలిపోతే రాజకీయ లబ్ధి పొందాలని చూస్తు న్నారనే అనుమానం కలుగుతున్నది. రాజకీయాలు చేయడం వల్ల తెలంగాణ సమాజం నష్టపోతుంది. వానకాలంలోపు పునరుద్ధరణ పనులు చేయాలి’’ అని చెప్పారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్​ హయాంలోనూ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని హరీశ్​ రావు అన్నారు. 

రాజీనామా చేసి పోత

వైట్​ పేపర్​ ప్రవేశ పెట్టే సమయంలో హరీశ్​ ఆవేశానికి లోనయ్యారు. మిడ్​ మానేరు ప్రాజెక్టు కాంగ్రెస్​ హయాంలోనే పూర్తయిం దని మంత్రి ఉత్తమ్​ చెప్తుండటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అది నిజమని నిరూ పిస్తే ఇప్పుడే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సభ నుంచి వెళ్లిపోతానని, ఇంకెప్పు డూ సభలోకి రానని, అన్నీ అబద్ధాలే చెప్తు న్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా హరీశ్​ను స్పీకర్​ గట్టిగా మందలించారు. సభలో మాట్లాడేందుకు సమయం ఇస్తామ ని, సభను డిస్టర్బ్​ చేయొద్దని సూచించారు. 

గద్దర్​, అందెశ్రీ పాటలు యాదిజేసిన హరీశ్ 

చర్చ సందర్భంగా హరీశ్​.. గద్దర్, అందెశ్రీ, జయరాజు పాటలను గుర్తుచేశారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అనుభవించిన కరువు బాధ, నీళ్ల గోస, అంతులేని వివక్షను, అడ్డులేని దోపిడీని చూసి ఆగ్రహించి పాటరాయని కవి లేడని ఆయన అన్నారు. ‘‘కాంగ్రెస్ పాలనలోరన్నో మనకు కన్నీళ్లే మిగిలాయిరన్నో...’’ అని గద్దర్​ పాట రాశారని, ‘‘చూడు తెలంగాణ, చుక్కలేని నీళ్లు లేని దాన..”అని అందెశ్రీ పాట రాశారని, ‘‘వానమ్మవానమ్మ.. ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ” అని జయరాజు పాటరాశారని తెలిపారు.