గ్రూప్ 2 వాయిదా?..డీఎస్సీ ఎస్​జీటీ ఎగ్జామ్స్ కూడా..

గ్రూప్ 2 వాయిదా?..డీఎస్సీ ఎస్​జీటీ ఎగ్జామ్స్  కూడా..
  • ఎన్నికల షెడ్యూల్​తో పరీక్షల తేదీల్లో మార్పులు 
  • రీషెడ్యూల్​కు కసరత్తు చేస్తున్న టీఎస్​పీఎస్సీ, విద్యాశాఖ 
  • ఎన్నికల తర్వాతే  పరీక్షలు నిర్వహించే అవకాశం

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో పలు పరీక్షలు వాయిదా పడే అవకాశముంది. నవంబర్​లో జరగాల్సిన గ్రూప్ 2 ఎగ్జామ్ రెండోసారి పోస్ట్ పోన్ కానుంది. దీంతో పాటు అదే నెలలో నిర్వహించాలనుకున్న డీఎస్సీ పరీక్షలూ వాయిదా పడనున్నాయి. అయితే డీఎస్సీ మొత్తం ఎగ్జామ్స్ వాయిదా వేయాలా.. లేక కేవలం ఎస్​జీటీ  ఎగ్జామ్​ మాత్రమే వాయిదా వేయాలా అనేదానిపై  అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోపక్క ఈ ఎగ్జామ్స్ రీషెడ్యూల్​ కోసం  టీఎస్పీఎస్సీ, విద్యాశాఖ కసరత్తు చేస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. గతేడాది 783 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 నోటిఫికేషన్ ను టీఎస్​పీఎస్సీ రిలీజ్​ చేసింది. అప్పట్లో ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. ఒకేసారి గురుకుల, ఇతర పరీక్షలకు షెడ్యూల్​ రావడంతో గ్రూప్ 2 వాయిదా కోసం అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో నవంబర్ 2, 3 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ రీషెడ్యూల్ రిలీజ్ చేసింది. అయితే, ప్రస్తుతం పరీక్షలకు నెలరోజుల గడువు ఉండగా, సోమవారం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. దీని ప్రకారం నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. దీంతో టీఎస్పీఎస్సీ అధికారుల్లో అయోమయం నెలకొన్నది. గ్రూప్ 2 ఎగ్జామ్​ కు 5,51,943 మంది అప్లై చేసుకోగా, వారికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల నిర్వహణకు సుమారు 25 వేల మంది పోలీసులు, మరో 25 వేల మందికి పైగా రెవెన్యూ సహా ఇతర  సిబ్బంది అవసరం. ఎన్నికల కోడ్ మొదలుకావడంతో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం మొత్తం ఎన్నికల ప్రక్రియలో నిమగ్నం కానుంది. దీంతో గ్రూప్ 2 నిర్వహణ నవంబర్ 2, 3 తేదీల్లో కష్టమేనని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ఇలాంటి సమయంలో పరీక్షలు నిర్వహిస్తే ఏమైనా సమస్యలు వస్తే ఇబ్బందేనని యోచిస్తోంది. దీంతో గ్రూప్ 2  కొత్త తేదీల కోసం టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల తర్వాతే  గ్రూప్ 2 నిర్వహించే అవకాశం ఉంది. 

డీఎస్సీ పరీక్షలూ డౌటే..!

అసెంబ్లీ ఎన్నికల ప్రభావం డీఎస్సీ ఎగ్జామ్స్​పైనా పడనుంది. స్టేట్​లో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రస్తుతం అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నవంబర్ 20 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో ఈ పరీక్షల తేదీలు మారే అవకాశముంది. నవంబర్ 30న పోలింగ్ నేపథ్యంలో ఆ తేదీకి ముందు నాలుగు రోజులు.. తర్వాత మూడు రోజుల పాటు ఎలాంటి ఎగ్జామ్ పెట్టేందుకు అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25 నుంచి 30 వరకు జరిగే ఎస్​జీటీ పరీక్షల నిర్వహణ కష్టమేనని తెలుస్తోంది. దీంతోపాటు డిసెంబర్ 1, 2 తేదీల్లో జరిగే డీఎస్సీ మైనర్ ఎగ్జామ్స్ కూడా వాయిదా పడనున్నాయి. అయితే వీటన్నింటిపైనా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది.