చేనేత చీరలు అమ్ముడుపోతలేవ్‌

చేనేత చీరలు అమ్ముడుపోతలేవ్‌

కరోనా ఎఫెక్ట్​ తగ్గినా ఇంకా పెరగని సేల్స్
గిరాకీ లేక చీరలు కొనని వ్యాపారులు.. అగ్గువకే అమ్ముకోవాల్సిన పరిస్థితి
రోజుకు రూ. 300 కూడా గిట్టుబాటు అయితలేవంటున్న నేతన్నలు
మళ్లీ వలసలు.. వేరే చిన్న చిన్న పనులు చేసుకుంటున్నమని ఆవేదన
రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం

హైదరాబాద్‌, వెలుగు:చేనేత చీరలు అమ్ముడుపోక నేత కార్మికులు కష్టాలు పడుతున్నారు. కరోనా ఎఫెక్ట్​ తగ్గినా చీరల అమ్మకాలు మునుపటి స్థాయికి రాలేదని వాపోతున్నారు. చీరల నిల్వలు పేరుకుపోయి, పని కూడా బంద్​ అవుతోంది. తక్కువ రేట్లకే అమ్ముకోవాల్సి వస్తోంది. అటు గిరాకీ లేక, డబ్బులు రాక సావుకార్లు కార్మికులకు లేట్‌గా పైసలు ఇస్తున్నరు. దీంతో చాలా మంది నేతన్నలు పెద్ద టౌన్లకు వలస పోతున్నారు. కొందరు ఉన్నచోటనే ఏవో వేరే చిన్నచిన్న పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నరు.

సగానికి పడిపోయిన సేల్స్‌

కరోనాతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. కొన్ని నెలలపాటు దేశమంతా స్తంభించింది. మాల్స్, బట్టల దుకాణాలు బంద్ అయ్యాయి. పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. చీరల ఎగుమతి ఆగిపోయింది. దీనితో చేనేతపై తీవ్రంగా ఎఫెక్ట్ ​పడింది. ఈ మధ్య అన్ని రంగాలు గాడిన పడుతున్నా.. చేనేత అమ్మకాలు మాత్రం పెరగలేదు. కరోనాకు ముందటి టైంతో పోలిస్తే ఇప్పుడు సగం మేర కూడా సేల్స్‌ జరగడం లేదు. రాష్ట్ర చేనేత సహకార సంస్థ లెక్కల ప్రకారం 2019–20 ఫైనాన్షియల్​ ఇయర్​తో పోలిస్తే 2020–21 ఏడాదిలో విక్రయాలు
నాలుగున్నర కోట్ల యూనిట్ల మేర తగ్గాయి. కరీంనగర్‌, వరంగల్‌, సికింద్రాబాద్‌ డివిజన్లలో 2019–20లో ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు 11.20 కోట్ల మేరకు అమ్మకాలు జరగ్గా.. 2020–21లో అదే టైంకి రూ.6.8 కోట్ల మేర మాత్రమే సేల్స్‌ జరిగాయి.

రాష్ట్రంలో లక్ష వరకు కుటుంబాలు చేనేత చీరలపై ఆధారపడి ఉన్నాయి. రాష్ట్రంలో నల్గొండ, గద్వాల, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఆసిఫాబాద్‌‌, జనగాంతోపాటు తదితర జిల్లాల్లో పట్టుచీరలు చేస్తున్నారు. వారందరిదీ  రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. నేసిన చీరలన్నీ ఎక్కడికక్కడ సావుకార్ల దగ్గర, చేనేత సహకార సంఘాల్లో గుట్టలుగా పేరుకుపోతున్నాయి. గిరాకీ లేకపోవడంతో కొందరు తక్కువ ధరలకే చీరలను అమ్ముకుంటున్నారు. సాధారణంగా రూ.10 వేలకు అమ్మే చీరలో దాదాపు రూ.5 వేల నుంచి 7 వేల వరకు పెట్టుబడే ఉంటుంది. అన్నీ పోగా చీరకు రూ.3 నుంచి 4 వేల వరకు వచ్చేది. కానీ ఇప్పుడదే పట్టుచీరను రూ.7 వేల నుంచి రూ.8 వేలకే అమ్ముతున్నారు.

వేరే పనులు చేసుకుంటున్నరు

గతంలో చేనేతకు మంచి రోజులు లేకపోవడంతో వలసలు వెళ్లేవారు. ఇతర పనులు చేసుకునే వారు. కానీ కరోనా కంటే ఏడాది, రెండేళ్ల ముందు చేనేతకు మంచి డిమాండ్‌‌ ఉండటంతో వారంతా మళ్లీ నేత పని మొదలుపెట్టారు. కానీ కరోనా తర్వాత బతుకులు ఆగమయ్యాయి. భార్యభర్త ఇద్దరు కలిసి పనిచేసినా రోజుకు రూ.300 కూడా రావడం లేదు. చేసిన పనికి గిట్టుబాటు కాకపోవడంతో ఇతర పనులకు వెళ్లాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలకు వలసలు పెరిగాయి. కొందరు ఉన్న ఊర్లోనో, దగ్గరిలోని టౌన్లలోనో జ్యూస్‌‌, సోడా బండ్లు, హోటళ్లు పెట్టుకుంటున్నారు. మరికొందరు ఆటోలు నడుపుతున్నారు. వాచ్‌‌మెన్, సెక్యూరిటీ గార్డులుగా, షాపింగ్​ మాల్స్​లో సేల్స్​ స్టాఫ్​గా మారిపోతున్నారు.

కూలీ లేట్‌‌గా ఇస్తున్నరు

పట్టు చీరలు అంతంత మాత్రమే సేల్ అవుతుండటంతో నేతన్నలకు ఇబ్బందులు తప్పట్లేదు. సేల్స్ లేక చీరలు తీసుకెళ్లడానికి వ్యాపారులు పెద్దగా రావడం లేదు. సావుకార్లు కూడా కార్మికులకు పెద్దగా పని ఇవ్వడం లేదు. కొందరు పని ఇచ్చినా కూలీ డబ్బులు మాత్రం లేట్‌‌గా ఇస్తున్నారు. దీంతో నేత కార్మికులకు పూట గడవడం కష్టంగా మారింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా.. రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదని నేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్క రాష్ట్రం ఏపీలో అక్కడి సర్కారు నేతన్నలకు అండగా నిలుస్తోందని.. మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు ఏటా రూ. 24 వేలు ఇస్తోందని చెప్తున్నారు.

మగ్గం బంద్‌ చేసి.. జ్యూస్‌ బండి పెట్టిన

కరోనా వల్ల కూలీ రేట్లు తగ్గాయి. చీరలు కొనేందుకు వ్యాపారులు వస్తలేరు. దళారులు అడిగిన రేట్లకే ఇవ్వాల్సి వస్తోంది. చీరల ధరలు
పెంచుతలేరు. భార్యభర్త ఇద్దరు పనిచేస్తే రోజుకు మూడు నాలుగు వందలు కూడా వస్తలేవ్. మళ్లీ వేరే చిన్న చిన్న పనులు చేసుకోవాల్సి
వస్తోంది. నేను జ్యూస్‌ బండి పెట్టి నడిపిస్తున్నా. సబ్సిడీ రూపంలో లోన్లు ఇస్తే బాగుంటుంది.                           – యనగందుల కృష్ణ, జనగాం

ప్రభుత్వమే ఆదుకోవాలి

నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావట్లేదు. త్రిఫ్ట్‌‌ ఫండ్‌‌ కంటిన్యూ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సేల్స్‌‌ పికప్‌‌ కాలేదు. స్టేట్‌‌ గవర్నమెంట్‌‌ కొనడం లేదు. నూలుపై 40శాతం స్టేట్‌‌ గవర్నమెంట్ సబ్సిడీ రాష్ట్రవ్యాప్తంగా అమలుకావట్లేదు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి చేనేత కార్పొరేషన్‌‌, పవర్‌‌ లూమ్‌‌ కార్పొరేషన్‌‌ ఏర్పాటు చేసి.. వెయ్యి కోట్లు ఇస్తామన్నరు. కానీ ఇప్పటిదాకా అతీగతీ లేదు. సహకార సంఘాలు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆత్మహత్యలు ఇంకా కొనసాగతున్నాయి. ప్రభుత్వమే ఆదుకోవాలి.

 –  దాసు సురేశ్, నేతన్నల ఐక్యకార్యచరణ కమిటీ చైర్మన్‌‌

 

పూటగడవని పరిస్థితి

కరోనా, లాక్​డౌన్ వల్ల చేనేత కార్మికుల బతుకుల్లో చీకటి నిండింది. మార్కెట్ లేక నేసిన చీరలు అలాగే ఉన్నాయి. అధికారులు టెస్కో చే అమ్మిస్తామని చెప్పినా అది కొంతవరకే జరిగింది. కొత్తగా చీరలు నేయక కార్మికులకు పూటగడవని పరిస్థితి.

      – పగడకుల శ్రీనివాసులు, చేనేత సంఘం నేత, నారాయణపేట

 

పెళ్లిళ్లు స్టార్టైతే కొనుగోళ్లు పెరుగుతయ్

ముహూర్తాలు లేక పెళ్లిళ్లు అయితలేవు. మే చివరి వారం వరకు ముహుర్తాలు లేవు. అప్పటి వరకు ఇదే పరిస్థితి ఉంటది.  ముహూర్తాలు స్టార్టవగానే పట్టుచీరల కొనుగోళ్లు పెరుగుతయ్.                                       – తడ్క రమేశ్​, టై అండ్​ డై అసోసియేషన్​ ప్రెసిడెంట్​, పోచంపల్లి

 

అగ్గువకే అమ్ముకుంటున్నరు

నేతన్నలు చేనేత చీరలు అగ్గువకే అమ్ముకుంటున్నరు. లాక్​డౌన్ తర్వాత రూ.15 కోట్ల పైచిలుకు చీరలు తక్కువకే అమ్ముకున్నరు. ప్రభుత్వం ప్రతి మూర చీర కొంటామని చెప్పి కొనలేదు. సిరిసిల్లకు చెందిన కొందరు మాస్టర్ వీవర్లు సూరత్ తదితర ప్రాంతాల నుంచి పాలిస్టర్ చీరలు తెచ్చి చేనేత చీరలుగా బతుకమ్మ పండుగకు ప్రజలకు అంటగడుతున్నారు.

   – రామలింగేశ్వర కాంబ్లే, గద్వాల జిల్లా చేనేత సహకార సంఘం అధ్యక్షుడు