కుక్కలను చంపేశాయని చిరుతలపై పగ

కుక్కలను చంపేశాయని చిరుతలపై పగ

విషం పెట్టి మూడింటిని చంపేశాడు

పగ, పట్టరాని పగ. తన పెంపుడు జంతువులను పొట్టనబెట్టుకున్నాయని కసి పెంచుకున్నాడు. చిరుతలపై పగ పెంచుకున్నాడు. మూడింటిని విషం పెట్టి చంపేశాడు. హరిద్వార్​కు చెందిన శుక్పాల్ అనే వ్యక్తి ఆ నేరాన్ని అంగీకరించాడు. తన రెండు కుక్కలను చంపేశాయన్న పగతోనే వాటిని చంపానని ఒప్పుకున్నాడు. అసలేం జరిగిందంటే.. ఆగస్టు 5న శివాలిక్​ శ్రేణుల్లోని హరిద్వార్​, లాన్స్​డౌన్​, రాజాజీ అటవీ డివిజన్లలో మూడు చిరుతలు చనిపోయి ఉండడాన్ని అధికారులు గుర్తించారు. వాటి మీద ఒక్క గాటు కూడా లేకపోవడంతో వాటి మరణంపై అధికారులకు అనుమానమొచ్చింది. ఇది కచ్చితంగా ఎవరో కావాలనే పగబట్టి చంపేశారని భావించారు. అందుకు తగ్గట్టుగా దర్యాప్తు చేశారు.

పోస్ట్​మార్టం చేయగా చిరుతల కడుపులో ఇంకా అరగని కుక్కల ఎముకలు, వాటి జుట్టు ఆనవాళ్లు దొరికాయి. వాటిలో విషం జాడలను అధికారులు గుర్తించారు. దీంతో వాళ్ల అనుమానం మరింత బలపడింది. అటవీ నర్సరీల నుంచి ఆ విషపూరిత ఆహారాన్ని పెట్టినట్టు లాన్స్​డౌన్​లోని వైల్డ్​లైఫ్​ స్పెషల్​ ఆపరేషన్స్​ గ్రూప్​ (ఎస్​ఓజీ) గుర్తించింది. ఒక నర్సరీలో శుక్పాల్​ భార్య కాంట్రాక్ట్​ ఉద్యోగిగా పనిచేస్తుండడమూ, శుక్పాల్​ను పట్టుకునేందుకు పోలీసులకు సాయపడింది. ‘‘ఇవి ప్రతీకారంతో చేసిన హత్యలే. కిల్లర్​ 505 అనే పురుగుమందులను చనిపోయిన కుక్కపిల్ల కళేబరంపై పోసి చిరుతలకు ఎరగా వేశారు. అది కూడా మా అటవీ పరిధిలోని నర్సరీల నుంచే జరిగింది” అని ఓ అధికారి చెప్పారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని సెక్షన్​ 51 ప్రకారం శుక్పాల్​పై కేసులు పెట్టారు.