మరింత  అఫోర్డబుల్​గా స్మార్ట్ వాచ్

 మరింత  అఫోర్డబుల్​గా స్మార్ట్ వాచ్

న్యూఢిల్లీ: మనదేశంలో స్మార్ట్​వాచ్​లను జనం తెగ కొంటున్నారు. ఈ విషయంలో మనం చైనాను దాటేశాం.  భారతదేశం రెండవ అతిపెద్ద స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాచ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌గా అవతరించింది. 2022 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్​లో డ్రాగన్​ మార్కెట్​ను అధిగమించింది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత కన్జూమర్లు ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనకు గురయ్యారని, అందుకే ఈ హెల్త్​ డివైజ్​లకు డిమాండ్​ పెరిగిందని భారతీయ స్మార్ట్ వాచ్ కంపెనీలు భావిస్తున్నాయి. కన్జూమర్లలో ఆరోగ్య స్పృహ పెరగడం కరోనా తరువాత స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టే భారతదేశ స్మార్ట్‌‌‌‌‌‌‌‌వాచ్ మార్కెట్ సంవత్సరానికి 347 శాతానికి పైగా పెరిగింది. కౌంటర్‌‌‌‌‌‌‌‌పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, ఫైర్-బోల్ట్,  నాయిస్ వంటి  భారతీయ బ్రాండ్‌‌‌‌‌‌‌‌లు కూడా గ్లోబల్ మార్కెట్​లో దూసుకెళ్తున్నాయి. ఉత్తర అమెరికా అతిపెద్ద స్మార్ట్‌‌‌‌‌‌‌‌వాచ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌గా మొదటిస్థానంలో కొనసాగుతోంది. మునుపటి క్వార్టర్​లో చైనా రెండవ స్థానంలో ఉంది. కోవిడ్ -19 లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లు,  ప్రతికూల ఆర్థిక గ్రోత్​ కారణంగా డిమాండ్ తగ్గిపోవడంతో దాని ఎగుమతులు 10 శాతం పడిపోయాయి. దీంతో మూడవ స్థానానికి పరిమితమైంది. అంతకుముందు క్వార్టర్​లో మూడో స్థానంలో ఉన్న యూరప్.. రష్యా-–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమ్మకాలు 13 శాతం తగ్గి  నాలుగో స్థానానికి పడిపోయింది.

అందుబాటు ధరలు..

"ఈ క్వార్టర్​లో  భారతీయ  మార్కెట్లోకి  రవాణా​అయిన వాటిలో 30 శాతం మోడల్స్​ధర 50 డాలర్ల (దాదాపు రూ.4,500) కంటే తక్కువే! మేజర్​ లోకల్​ బ్రాండ్లన్నీ తక్కువ ధర మోడల్‌‌‌‌‌‌‌‌లను లాంచ్​ చేశాయి. దీంతో  గిరాకీ బాగుంది " అని కౌంటర్‌‌‌‌‌‌‌‌పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ సుజియోంగ్ లిమ్ చెప్పారు.   నాయిస్ 298 శాతం గ్రోత్​ను రికార్డు చేసింది. ఇది భారతీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో 26 శాతం వాటా సాధించింది.  ఫైర్-బోల్ట్ క్వార్టర్లీ షిప్​మెంట్ల విషయంలో మొదటి స్థానంలో ఉంది. కోవిడ్- తర్వాత కన్జూమర్లు ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనకు గురయ్యారని, స్మార్ట్​వాచీల్లో హార్ట్​రేట్​, టెంపరేచర్​, ఎస్పీఓ2,  స్లీప్  మెజర్​మెంట్​ వంటి ఫీచర్లు ఉండటంతో వీటి అమ్మకాలు ఊపందుకున్నాయని కంపెనీలు అంటున్నాయి. " స్మార్ట్‌‌‌‌‌‌‌‌వాచ్‌‌‌‌‌‌‌‌లు ఆరోగ్యపరమైన పారామీటర్లను గుర్తించడంలో సహాయపడతాయి. వ్యక్తులు తమను తాము స్వయంగా పర్యవేక్షించుకోవడానికి ఉపకరిస్తాయి. ఈ డివైజ్​లు సేకరించే డేటా డాక్టర్లు ట్రీట్​మెంట్లు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇవి ఎంతమాత్రం లగ్జరీ ప్రొడక్టులు కావు. అందరూ కొనుక్కోవచ్చు ”అని గూకీ ఫౌండర్​ & సీఈఓ విశాల్ గొండల్ అన్నారు.

గ్లోబల్​గా ఆపిల్​ నెం.1

తక్కువ ధరలకు రావడమే గాక వీటిని ధరించడం ఫ్యాషన్​గానూ మారడంతో స్మార్ట్​వాచీల అమ్మకాలు స్పీడ్​గా పెరుగుతున్నాయి. “స్మార్ట్ వాచ్ మరింత  అఫోర్డబుల్​గా  మారుతోంది. భారతీయ కన్జూమర్లలో స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌వాచ్‌‌‌‌కి భారీ డిమాండ్,  ఆసక్తి పెరగడానికి చౌకధరలు,  ఫ్యాషన్.. రెండు అతిపెద్ద కారకాలు”అని ప్లే కో–ఫౌండర్​ వికాస్ జైన్ అన్నారు. ‘‘గత కొన్ని క్వార్టర్లలో వేరబుల్​ మార్కెట్లలో ఇండియా బ్రాండ్లు తమ సత్తా చాటుతున్నాయి. గ్లోబల్ వేరబుల్స్ ఇండస్ట్రీలో భారీ వాటా దక్కించుకున్నాయి. ఈ నెల ప్రారంభంలో వచ్చిన ఐడీసీ లెక్కల ప్రకారం నాయిస్​ నంబర్ 1 స్మార్ట్‌‌‌‌వాచ్ బ్రాండ్‌‌‌‌గా ఆవిర్భవించింది.  ప్రపంచవ్యాప్తంగా టాప్ 5 స్మార్ట్‌‌‌‌వాచ్ బ్రాండ్‌‌‌‌లలో మేమూ ఉన్నాం” అని నాయిస్ కో–ఫౌండర్​గౌరవ్ ఖత్రి అన్నారు. కౌంటర్‌‌‌‌పాయింట్ రీసెర్చ్ ఇటీవల ప్రచురించిన గ్లోబల్ స్మార్ట్‌‌‌‌వాచ్ మోడల్ ట్రాకర్ ప్రకారం, ఇన్​ఫ్లేషన్​, యుద్ధం వంటి సమస్యలు ఉన్నప్పటికీ గ్లోబల్​గా స్మార్ట్‌‌‌‌వాచ్ మార్కెట్ ఎగుమతులు 13 శాతం పెరిగాయి. యాపిల్ గ్లోబల్ స్మార్ట్‌‌‌‌వాచ్ మార్కెట్‌‌‌‌లో తన వాటాను మరో 8 శాతం పెంచుకొని మొదటిస్థానాన్ని నిలుపుకుంది. మొత్తం షిప్‌‌‌‌మెంట్‌‌‌‌లలో 29.3 శాతం వాటాను సాధించింది. శామ్​సంగ్ 40 శాతం ఏడాది గ్రోత్​సాధించింది.  మొత్తం షిప్‌‌‌‌మెంట్‌‌‌‌లలో 9.2 శాతంతో రెండవ స్థానాన్ని  కొనసాగించింది.