హైదరాబాద్, వెలుగు: ఉద్యోగాల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేసింది. ఇప్పటికే 9,168 గ్రూప్4 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. తాజాగా హెల్త్ డిపార్ట్మెంట్లోని మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఖాళీల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఎంఆర్హెచ్ఎస్బీ) మంగళవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈనెల 20వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 2023 జనవరి 5వ తేదీ దాకా గడువిచ్చింది. ఎంఆర్హెచ్ఎస్బీ వెట్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మెరిట్ ఆధారంగానే భర్తీ
క్యాండిడేట్ల క్వాలిఫికేషన్, మెరిట్ ఆధారంగా పోస్టులను మెడికల్ బోర్డు భర్తీ చేయనుంది. మెరిట్‌ను బట్టి 80 పాయింట్లు, ప్రభుత్వ దవాఖానల్లో సర్వీసును బట్టి మరో 20 పాయింట్లను కేటాయించి పోస్టులను ఫిల్ చేస్తుంది. గిరిజన ప్రాంతాల్లో 6 నెలల పాటు పనిచేసిన వారికి అదనంగా 2.5 పాయింట్లు, ఇతర గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన వారికి 2 పాయింట్ల చొప్పున కేటాయించనుంది. అభ్యర్థులకు వయోపరిమితిని 18–44 ఏండ్లుగా నిర్ణయించింది.
అప్లికేషన్ ఫీజుతో పాటు ప్రాసెసింగ్ ఫీజు
సాధారణంగా ఏదైనా జాబ్‌కు అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫీజు కామన్‌గా ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో అప్లికేషన్ ఫీజుతో పాటు ప్రాసెసింగ్ ఫీజునూ రిక్రూట్మెంట్ బోర్డు వసూలు చేస్తోంది. అప్లికేషన్ ఫీజు కింద రూ.500, ప్రాసెసింగ్ ఫీజు కింద మరో రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, దివ్యాంగులు, నిరుద్యోగులకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపునిచ్చింది.

