సినిమాల్లో చూస్తుంటాం.. కంటికి కనిపించని వాయువు లేదా సూక్ష్మక్రిములు సోకి జనాలు పిట్టల్లా రాలిపోతుంటారు. దాన్ని చూసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరిగెడుతుంటారు. అలాంటి సీన్స్ రియల్ లైఫ్ లో కూడా చూడాల్సి వస్తుందేమో. ఎందుకంటే.. ఒక 21 ఏళ్ల యువకుడు.. ఒక బ్యాక్టీరియా సోకడంతో గంటల వ్యవధిలోనే చనిపోయాడు. కరోనా లాంటి వ్యాధుల నుంచి ప్రపంచం తనను తాను కాపాడుకున్నప్పటికీ.. ఇలాంటి కొత్త వ్యాధులు మానవాళికి సవాళ్లు విసురుతూనే ఉన్నాయి.
ఆస్ట్రేలియా పెర్త్ కు చెందిన అసెగ్జాండర్ ఫిలాజీన్ (21) అనే స్టూడెంట్.. ఇటీవల మెనింగోకాకల్-బి (Meningococcal B) అనే బ్యాక్టీరియా సోకి చనిపోయాడు. ఆస్ట్రియాలో చదువుతున్న అలెగ్జాండర్.. ఇటీవలే పోర్చుగల్ లోని పోర్టో నుంచి ఆస్ట్రియా లోని వియన్నాకు ట్రావెల్ చేశాడు. అనూహ్యంగా అనీజీగా ఉందంటూ గంటల వ్యవధిలోనే కుప్పకూలిపోయాడు. మెనింగోకాకల్-బి వ్యాధి సింప్టమ్స్ కనిపించిన కొన్ని గంటల్లోనే అలెజ్గాండర్ చనిపోయినట్లు అతని అంకుల్ తెలిపాడు. వ్యాధి సోకిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లామని.. మెనింగోకాకల్ వ్యాధికి విరుగుడు వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ బతకలేదని టాక్టర్స్ ప్రకటించారు.
ఈ బ్యాక్టీరియాలో సబ్ టైప్ బీ-స్ట్రైన్ కు గురయ్యాడని.. అది చాలా అగ్రెస్సివ్ గా ఉండటమేకాకుండా.. తొందరగా తన లక్షణాలను మార్చుకునే స్వభావం కలిగి ఉంటుందని డాక్టర్స్ తెలిపారు. ముఖ్యంగా ఒకదేశం నుంచి మరో దేశం తిరిగే వారికి ఇలాంటి వ్యాధి సోకే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
►ALSO READ | అశ్వగంధ ఆకుల వల్ల లివర్ పాడవుతుందంట..! నిషేధం విధించిన FSSAI
లక్షణాలు కనిపించిన కొద్ది గంటల్లోనే అలెగ్జాండర్ కుప్పకూలిపోయాడు. అతని పరిస్థితి వేగంగా క్షీణించడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు. అలెగ్జాండర్‌కు మెనింగోకాకల్ వ్యాక్సిన్ వేయబడింది , అయితే, అతను అన్ని రకాల స్ట్రెయిన్‌ల నుండి రక్షణ పొందాడో లేదో స్పష్టంగా తెలియదు. తీవ్రమైన మరియు అత్యంత వేగంగా వ్యాపించే బి-స్ట్రెయిన్ యొక్క ఒక ఉప-రకం అతనికి సోకి ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.
- మెనింగోకాకల్ బి అంటే ఏంటి?
మెనింజైటిస్ అనేది మెదడు, వెన్నుపాము (బ్రెయిన్, స్పైనల్ కార్డ్) చుట్టూ ఉన్న కణజాలాలలో వాపును కలిగించే ఒకరకమైన వ్యాధి. అనేక రకాల బాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాలు మరియు పరాన్నజీవుల వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. మెనింజైటిస్ ప్రపంచ ఆరోగ్య ముప్పుగా మిగిలిపోయిందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. మెనింగోకాకల్ అని కూడా పిలువబడే నైస్సేరియా మెనింజిటిడిస్ , ఒక రకమైన బాక్టీరియల్ మెనింజైటిస్. మెనింగోకాకల్‌లో A, B, C, W, X, Y, Z రకాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా టీనేజర్స్, యువకులను ప్రభావితం చేస్తాయి. ప్రపంచ రోగనిరోధక కూటమి (ఇమ్యునైజేషన్ కోయలిషన్) ప్రకారం , మెనింగోకాకల్ B రకం వ్యాధి సరైన సమయంలో ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. మెనింగోకాకల్ B రక్షించుకోవడానికి టీకా వేయించుకోవడమే ఉత్తమ మార్గమని డాక్టర్లు చెబుతున్నారు.
- మెనింగోకాకల్ బి లక్షణాలు:
మెనింగోకాకల్ బి వ్యాధి చాలా వేగంగా శరీరంలో విస్తరిస్తుంది. దీని లక్షణాలు కూడా వెంటనే బయటపడతయి. వీటికి తక్షణ వైద్య సంరక్షణ అవసరం. వ్యాధిని ముందుగా గుర్తించడం ద్వారా అది ప్రాణాంతకం కాకుండా నివారించవచ్చు.
సాధారణ లక్షణాలు
ఈ బ్యాక్టీరియా సోకిన 1 నుంచి 10 రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి సోకిన వారు త్వరగా తీవ్ర అస్వస్థతకు గురవుతారని ఇమ్యునైజేషన్ కోయలిషన్ చెబుతోంది. కొన్ని సాధారణ లక్షణాలు:
గందరగోళం (కన్ఫ్యూజన్)
కాంతికి సున్నితత్వం (ఫోటోఫోబియా)
మెడ బిగ్గరగా మారటం
తలనొప్పి
చిరాకు
కండరాల నొప్పులు
రెడ్ - పర్పుల్ రంగులో కురుపులు లేదా దద్దుర్లు
చేతులు, పాదాలు చల్లగా మారటం
కీళ్ల నొప్పి
వికారం, వాంతులు
జ్వరం
- పెద్దలు/టీనేజర్లలో:
చల్లటి చేతులు, పాదాలు, కండరాలు/కీళ్ల నొప్పులు, గందరగోళం, వేగవంతమైన శ్వాస, విరేచనాలు, అలసట వంటి లక్షణాలుగా ఉంటాయి. వ్యాధి ముదిరే కొద్దీ మగత లేదా మూర్ఛ వచ్చే అవకాశం ఉంటుంది.
- శిశువులలో/పిల్లలలో:
చిరాకు, సరిగ్గా పాలు తాగకపోవడం, నీరసం, బిగ్గరగా ఏడవడం, చర్మం పాలిపోవడం మరియు మూర్ఛలు. మూర్ఛ ప్రమాదాన్ని పెంచుతాయి.
- మెనింగోకాకల్ వ్యాధి నివారణ చర్యలు
సాధారణ రకాల బాక్టీరియల్ మెనింజైటిస్ కు టీకాలు సరిపోతాయని WHO చెబుతోంది . మెనింగోకాకల్ వ్యాధి నివారణకు కొన్ని నివారణ చర్యలు:
- టీకా:
11-12 సంవత్సరాల వయస్సులో మెనింగోకాకల్ కాంజుగేట్ (MenACWY) టీకా వేయించుకోవాలి , 16 సంవత్సరాల వయస్సులో బూస్టర్ డోస్ తీసుకోవాలి. సెరోగ్రూప్ B నుండి అదనపు రక్షణ కోసం MenB టీకాలు సిఫార్సు చేస్తున్నారు. ఈ టీకాలు సాధారణ స్ట్రెయిన్‌లను (A, C, W, Y, B) లక్ష్యంగా చేసుకుంటాయి. ప్రీటీన్స్, టీనేజర్లు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇవి చాలా కీలకమైనవి.
- పరిశుభ్రత పద్ధతులు:
సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోవాలి. ముఖ్యంగా వాష్ రూమ్ వెళ్లిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. అలాగే భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కడగని చేతులతో కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకవద్దు. డ్రింక్స్, ఆహారం, పాత్రలు, లిప్‌స్టిక్‌లు, సిగరెట్లను ఇతరులతో పంచుకోవద్దు. దగ్గు/తుమ్ములు వచ్చినపుడు కర్చీఫ్ లేదా చేతులతో కవర్ చేసుకోవాలి. ఈ అలవాట్లు బ్యాక్టీరియా వ్యాప్తిని తగ్గించేస్తాయి
- కాంటాక్ట్ మేనేజ్‌మెంట్:
వ్యాది సోకిన వారికి దగ్గరగా ఉన్నవారు (కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ లేదా ఎక్కువసేపు సన్నిహితంగా ఉన్నవారు) యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీలైతే 24 గంటలలోపు తీసుకోవాలి. జ్వరం , దద్దుర్లు లేదా మెడ పట్టేయడం వంటి లక్షణాలు వస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం మంచిది.
- ముఖ్యంగా పాటించాల్సినవి:
వ్యాధి సోకినప్పుడు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దు, విశ్రాంతి తీసుకోవాలి. అనారోగ్యంగా ఉంటే ఇంట్లోనే ఉండటం మంచిది. ఏ టీకా కూడా అన్ని రకాల వైరస్‌లను నిరోధించదు. వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉండటం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. శిశువులు, కౌమారదశలో ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులకు ఎక్కువగా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

