V6 News

Kitchen Telangana: పనసతో పసందైన వంటకాలు..  నిమిషాల్లో ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..! 

Kitchen Telangana: పనసతో పసందైన వంటకాలు..  నిమిషాల్లో ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..! 

చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ల దాకా చాలామందికి పనస రుచి నచ్చుతుంది. మరి అంతటి టేస్టీ పనసకాయతో వంటలు చేసుకుంటే ప్లేట్ నిమిషాల్లో ఖాళీ అయిపోతుందంటే అతిశయోక్తి కాదు. పనస గింజలతో నోరూరించే గారెలతో పాటు బోలెడు వెరైటీ వంటలు వండుకోవచ్చు. ఇంకా  మరెందుకాలస్యం చటుక్కున మార్కెట్ కెళ్లి ఓ పనసకాయ తెచ్చేయండి. ఈ వంటకాలు ట్రై చేయండి.

పనసతో కేసరి తయారీకి కావాల్సినవి

  • పనస తొనలు - పది
  • ఉప్మా రవ్వ (తెల్ల)- ఒక కప్పు
  • పాలు- రెండు కప్పులు
  • డ్రైఫ్రూట్స్- అర టేబుల్ స్పూన్
  • పంచదార- పావు కప్పు
  • కుంకుమ పువ్వు (నానబెట్టిన)- కొద్దిగా
  • యాలకుల పొడి- అర టీ స్పూన్
  • నెయ్యి-రెండు టేబుల్ స్పూన్లు


పనసతో కేసరి తయారీ విధానం

పనస తొనలు మిక్సీ పట్టి పేస్ట్ చేయాలి. పాన్​ లో  నెయ్యి వేడిచేసి డ్రైఫ్రూట్స్ వేగించి పక్కనుంచాలి. అదే పాన్​ లో పనస తొనల పేస్ట్ వేగించాలి.

అందులో పాలు పోసి ఉప్మా రవ్వ, యాలకుల పొడి కూడా వేసి, బాగా కలపాలి. కాసేపయ్యాక పంచదార, నానబెట్టిన కుంకుమ పువ్వు, వేగించిన డ్రై ఫ్రూట్స్ వేసి దగ్గర పడనివ్వాలి. అంతే పనసకాయ కేసరి తినడానికి రెడీ.

పనస గారెలు తయారీకి కావాల్సినవి

  • పనస గింజలు(ఉడికించిన) - ఒక కప్పు
  • ఆలుగడ్డ- ఒకటి
  • శనగపప్పు- రెండు టేబుల్ స్పూన్లు
  • ఉల్లిగడ్డ తరుగు - అర టేబుల్ స్పూన్
  • పచ్చిమిర్చి- మూడు
  • జీలకర్ర - ఒక టీ స్పూన్
  • బియ్యప్పిండి- మూడు టేబుల్ స్పూన్లు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
  • ఉప్పు- తగినంత
  • టొమాటో సాస్ - ఒక టేబుల్ స్పూన్
  • కొత్తిమీర - కొద్దిగా
  • నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

పనస గారెలు తయారీ విధానం

మిక్సీ జార్లో పనస గింజలు, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ తరుగు వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీయాలి.

అందులో ఉడికించిన ఆలుగడ్డ పేస్ట్, జీలకర్ర, బియ్యప్పిండి, కొత్తిమీర, నానబెట్టిన శనగపప్పు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని గారెల్లా వత్తి కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఆపై టొమాటో సాస్​ తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.


పనస బిర్యానీ తయారీకి కావాల్సినవి 

  • పనస ముక్కలు - అర కేజీ
  • బియ్యం - ఒకటిన్నర కప్పు 
  • నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు
  • బిర్యానీ ఆకులు- రెండు.
  • లవంగాలు- రెండు
  • యాలకులు-రెండు.
  • మరాఠీ మొగ్గ- చిన్నది
  • జాజిపువ్వు- తగినంత
  • ఉల్లిగడ్డ తరుగు - అరకప్పు
  • టొమాటో తరుగు - అరకప్పు
  •  అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
  • ఉప్పు- తగినంత
  • కొబ్బరి పాలు - రెండు కప్పులు
  • ఎండు కొబ్బరి తురుము - అర కప్పు
  • పుదీనా తరుగు - అర కప్పు
  • నూనె - తగినంత

పనస బిర్యానీ తయారీ విధానం

పాన్​ లో నెయ్యి వేడిచేసి మసాలా దినుసులు అన్నీ వేసి వేగించాలి. అందులో ఉల్లిగడ్డ, టొమాటో తరుగు, పసన ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసి కలుపుతూ వేగించాలి.

ఆ మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొబ్బరి పాలు. కొబ్బరి తురుము కూడా వేయాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పుదీనా తరుగు, అరగంట నానబెట్టిన బియ్యం వేసి మూత పెట్టాలి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయాలి.