తెలుగువాళ్ల చరిత్రకు నూలుపోగు..కపిలవాయి అశోక్ బాబు సంపాదకీయాలు

తెలుగువాళ్ల చరిత్రకు నూలుపోగు..కపిలవాయి అశోక్ బాబు సంపాదకీయాలు

చరిత్ర అంటే కేవలం మహాసామ్రాజ్యాలు, రాజులు, రాజ్యాలు, యుద్ధాలు మాత్రమే కాదు. తరచి చూస్తే ప్రతి ఊరికీ వాడకూ, వాగుకూ వంకకూ, ప్రాంతానికీ క్షేత్రానికీ, మొత్తంగా ప్రతి ప్రాణికీ ఒక చరిత్ర కనిపిస్తుంది. అందులో మన ఆచారం, ఆహారం, సంస్కృతి, సంప్రదాయం, భాష, యాస మొదలైన వాటి ప్రస్థానం, పరిణామక్రమం ఉంటుంది. వీటి గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తి సహజం. దీనికోసం ఉపయోగపడే పుస్తకాల్లో ఒకటి.. కపిలవాయి అశోక్ ​బాబు సంపాదకత్వంలో వచ్చిన ‘డాక్టర్ కపిలవాయి లింగమూర్తి చారిత్రక వ్యాసాలు : తెలంగాణ చరిత్ర – సంస్కృతి– క్షేత్ర – గ్రామ  చరిత్రలు’. 

తెలంగాణ సాహితీ ప్రపంచంలో డాక్టర్ కపిలవాయి లింగమూర్తికి విశిష్ట స్థానం ఉంది. కవిగా, రచయితగా, చరిత్ర పరిశోధకుడిగా, శతాధిక గ్రంథకర్తగా ఆయన ఎన్నో గొప్ప రచనలు చేశారు. ముఖ్యంగా తెలంగాణలో మరుగున పడిన చరిత్రను పరిశోధనల ద్వారా వెలికితీయడంలో తన వంతు పాత్ర పోషించారు. ఆ క్రమంలో సుమారు 500కుపైగా వ్యాసాలు రచించారు. 

అవి భారతి, ఆరాధన, ఆంధ్రప్రభ, తెలుగు, సప్తగరి తదితర పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీటిలో ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రకంగా వచ్చిన 35 వ్యాసాలను ఒక్కచోట చేర్చి, ఏడో భాగంగా ప్రస్తుత పుస్తకాన్ని ఆయన కుమారుడైన రచయిత తెచ్చారు. ఈ పుస్తకంలో పాత పాలమూరు జిల్లా కేంద్రంగా విలసిల్లిన నాగ, నంది, సోమ వంశాలతోపాటు దుందుభీ తీరంలోని నాగరికత గురించి విస్తృతంగా కనిపిస్తుంది. అలాగే చోళుల పాలన, ఇక్ష్వాకులు, కదంబులు, విష్ణుకుండినుల ఆనవాళ్లు; కృష్ణా, తుంగభద్రల వెంట జన జీవన చరిత్రనూ రచయిత వివరించారు. 

ఆయా కాలాల్లోని పండుగలు, ఆచారాలు, వేటలు, కళలను అక్షరీకరించారు. ముఖ్యంగా బీచుపల్లి, కురుపురం, బెక్కేశ్వరం, శ్రీశైలం, అమ్మపల్లె, తీగలపల్లె, అంకూరు, సోమేశ్వరం, ఎండవెట్ల, దేవుని తిరుమలాపూర్, భైరవకోన తదితర క్షేత్రాలను గురించి ఎంతో విలువైన సమాచారం అందించారు.దాదాపు ప్రతి వ్యాసంలోనూ ఒక ప్రాంతాన్ని/ అంశాన్ని తీసుకొని, దాని చారిత్రక ప్రాశస్త్యాన్ని, నేపథ్యాన్ని, సాంస్కృతిక విశిష్టతను విశ్లేషించడం బాగుంది. 

గ్రామాల చరిత్ర చెప్పే క్రమంలో స్థానిక కథనాలు, ఆలయాలు, ఇండ్లు, కోటల నిర్మాణం, శిల్ప సంపద, ఆచారాలను అద్భుతంగా వివరించారు. వీటిని చదువుతుంటే పాఠకులు ఆయా కాలాల్లోకి వెళ్లి, ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుంది. పాలమూరు, వనపర్తి, నాగర్ కర్నూలు తదితర పట్టణాలతోపాటు మరికొన్ని గ్రామాల పాత పేర్లు పాఠకునికి ఆశ్చర్యం కలిగిస్తాయి. జానపదులు వేటల సంగతులూ ఇలాంటివే. భైరవకోనలోని ప్రతి జలపాతం/గుండం వెనక ఉన్న చరిత్ర ; అక్కడ కొలువైన దేవతలు; వాళ్ల మహిమలు ఉత్కంఠగా చదివిస్తాయి. 

చరిత్ర వివరించేటప్పుడు విన్నది, చూసింది, చదివింది అనే కోణాలు చాలా ముఖ్యం. వీటికి అవసరమైన ఆధారాలు, శాసనాలు, గ్రంథాలను రచయిత ప్రస్తావించారు. దీనికోసం ఆయన చేసిన పరిశోధన పుస్తకం చదువుతుంటే అర్థమవుతుంది. భాష సులభంగా, సరళంగా ఉంది. అవసరమైనచోట ప్రాచీన, సంస్కృత పదబంధాలు వాడినా అవి పెద్ద అడ్డంకి కావు. చరిత్రను ఆసక్తికరంగా, చదివించేలా చెప్పడంలో రచయితకు ఉన్న నైపుణ్యం ప్రతి వ్యాసంలోనూ కనిపిస్తుంది.

మొత్తంగా ఈ పుస్తకం పాత పాలమూరు జిల్లా కేంద్రంగా నడిచిన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, గ్రామీణ వారసత్వం, క్షేత్రాలు, నదులు, నల్లమల విశిష్టతను తెలిపే విలువైన పరిశోధన గ్రంథం. చరిత్రను అధ్యయనం చేయాలనుకునేవాళ్లకు, పోటీ పరీక్షల అభ్యర్థులకు, పరిశోధకులకు, విద్యార్థులకు, సాహిత్యాభిమానులకు ఎంతో ఉపయోగకరం. ఇందులోని వ్యాసాలన్నీ పాత పాలమూరు జిల్లా కేంద్రంగానే ఉన్నప్పటికీ తెలంగాణ/తెలుగువాళ్ల చరిత్రకు ఒక నూలుపోగు లాంటి ఈ పుస్తకం ప్రతి పాఠకుడి ఇంట్లోనూ ఉండాల్సిన విలువైన రచన.

జి. మహేశ్వర్ 

లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ featureseditor@v6velugu.com