హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య భారీగా పెరిగిందని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 850 నుంచి 2,901కు పెరిగాయని వెల్లడించారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సీట్ల సంఖ్య మూడింతలు పెరిగిందని, స్వరాష్ట్రంతోనే ఇది సాధ్యమైందన్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 3,639 సీట్లు ఉన్నాయని, ఈ ఒక్క ఏడాదే 1,200లకు పైగా సీట్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. దసరా తర్వాత ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోకు అనుగుణంగా ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో మంత్రి హరీశ్ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయకుండా అప్పటి ప్రభుత్వాలు తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేశాయని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే మెడికల్ కాలేజీల సంఖ్య పెంచుతామని ఉద్యమ సమయంలోనే తాను చెప్పానని, ఇప్పుడు ఆ మాట నెరవేర్చుకున్నామని గుర్తుచేశారు. ఈ 8 ఏండ్లలో కొత్తగా 12 మెడికల్ కాలేజీలను నిర్మించుకున్నామని తెలిపారు. బీ కేటగిరీ సీట్లలోనూ 85 శాతం స్థానికులకే కేటాయించడం వల్ల, 1,067 మంది విద్యార్థులకు సీట్లు వస్తాయన్నారు. రాబోయే రెండేండ్లలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ వస్తుందని తెలిపారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా 650 బెడ్ల హాస్పిటళ్లు ఏర్పడతాయని, వీటిల్లో 30 రకాల స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే, పీజీ మెడికల్ సీట్ల సంఖ్య 613 నుంచి 1,249కి పెరిగిందని మంత్రి వెల్లడించారు. ప్రైవేటు కాలేజీలతో కలుపుకొంటే ఆ సంఖ్య 2,449కు చేరిందన్నారు. ప్రతి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 5 కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు.
కిషన్‌రెడ్డివి దిగజారుడు మాటలు..
దేశంలో 157 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఒక్క కాలేజీని కూడా తెలంగాణకు ఇవ్వలేదని హరీశ్ అన్నారు. కాలేజీలు ఇచ్చినట్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పడం పచ్చి అబద్ధమని, అది ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కొత్త మెడికల్ కాలేజీల కోసం తాము రూ.4,080 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇందులో ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదని చెప్పారు. కిషన్‌రెడ్డికి దమ్ముంటే డబ్బులు ఇచ్చినట్టు రుజువు చేయాలని సవాల్ విసిరారు. కేంద్రం కాలేజీలు ఇచ్చినట్టు గవర్నర్ ట్వీట్ చేయడాన్ని హరీశ్ తప్పుబట్టారు.
నా వ్యాఖ్యలు వక్రీకరించారు..
ఆర్ఎంపీలు, పీఎంపీలకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని హరీశ్ అన్నారు. తాను ఎవరికీ సపోర్ట్ చేయడం లేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అన్ని హాస్పిటళ్లను తనిఖీ చేయిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 103 హాస్పిటళ్లను సీజ్ చేశామని, 633 హాస్పిటళ్లకు నోటీసులిచ్చామని, 75 ఆస్పత్రులకు జరిమానా విధించామని చెప్పారు. సర్జరీలు, అబార్షన్లు, డెలివరీలు చేసే అన్‌క్వాలిఫైడ్ ప్రాక్టీషనర్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. నిబంధనల ప్రకారం నడుచుకునే వారికి ఎలాంటి వేధింపులు ఉండవని మాత్రమే తాను చెప్పానని గుర్తుచేశారు.
