అక్రమ నిర్మాణాలకు భారీ ఫైన్లు వేయండి..నెక్నాంపూర్ కేసులో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

అక్రమ నిర్మాణాలకు భారీ ఫైన్లు వేయండి..నెక్నాంపూర్ కేసులో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  •     రెగ్యులరైజేషన్ పేరుతో అక్రమాలు చేస్తే ఊరుకోం
  •     చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ మూల్యం తప్పదని వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో అక్రమ నిర్మాణాలకు భారీ ఫైన్లు విధించాల్సిందేనని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. అనధికార కట్టడాలను అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నెక్నాంపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన అరుణా అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌ను జస్టిస్ బి. విజయ్‌‌‌‌‌‌‌‌సేన్‌‌‌‌‌‌‌‌రెడ్డి శనివారం విచారించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు సాధారణ విషయంగా మారిపోయాయని కోర్టు పేర్కొంది. 

రెగ్యులరైజేషన్ పేరుతో అనుమతులు ఇస్తూపోతే.. భవిష్యత్తులో అక్రమార్కులు తమకు హక్కులు లేని స్థలాలను సైతం కబ్జా చేసి భవనాలు నిర్మించే ప్రమాదముందని హెచ్చరించింది. రెగ్యులరైజేషన్ దరఖాస్తులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయనే కారణంతో కోర్టుల నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుని నిర్మాణాలు కొనసాగిస్తున్నారని తెలిపింది. జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ పరిధిలో ఇలాంటి దరఖాస్తుల సంఖ్య 2 లక్షలు దాటిందని వివరించింది. నిబంధనల ప్రకారం.. చిన్న స్థలాల్లో కట్టే కట్టడాలకే రెగ్యులరైజేషన్ వర్తిస్తుందని, అంతస్తుల కొద్దీ ఉండే భారీ భవనాలను ఆ పరిధిలోకి తేవడం ఆమోదయోగ్యం కాదని  కోర్టు తేల్చిచెప్పింది.

ఇది సమాజానికి తప్పుడు సంకేతాలిస్తుంది

రాజకీయ మద్దతుతో అక్రమ నిర్మాణాలను ఆపకపోవడం, తర్వాత వాటిని క్రమబద్ధీకరించడం వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని హైకోర్టు హెచ్చరించింది. చట్టాన్ని పాటించి సక్రమంగా ఇళ్లు కట్టుకునేవారికి ఇది తీవ్ర అన్యాయమని పేర్కొంది. ప్రస్తుత కేసులో పిటిషనర్ కోట్లాది రూపాయల విలువైన భారీ అక్రమ నిర్మాణం చేపట్టారని కోర్టు గుర్తించింది. ఆ దరఖాస్తును చట్టప్రకారం పరిశీలించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించింది. అయితే, తప్పు చేసినందుకు శిక్షగా ముందు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌కు రూ.2 లక్షలు చెల్లించాలని..వాటిని పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాలని స్పష్టం చేసింది. అలాగే, మరో రూ.లక్షను హైకోర్టు న్యాయవాదుల సంక్షేమ సంఘానికి  చెల్లించాలని ఆదేశిస్తూ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను కొట్టివేసింది. చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ కట్టడాలు చేపట్టేవారు తప్పనిసరిగా భారీ మూల్యం చెల్లించాల్సిందేనని హైకోర్టు పేర్కొంది.