ఆలయ భూములను సర్వే చేసి, కంచె వేయండి..అధికారులకు హైకోర్టు ఆదేశం

ఆలయ భూములను సర్వే చేసి, కంచె వేయండి..అధికారులకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మేడ్చల్‌‌ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌‌ మండలం జగద్గిరిగుట్టలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన 14.10 ఎకరాలను సర్వే చేయాలని..అనంతరం కంచె వేసి రక్షణ కల్పించాలంటూ కలెక్టర్, దేవాయదాశాఖ కమిషనర్‌‌లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సర్వే నెం.348/1లో ఆలయానికి చెందిన 14.10 ఎకరాల్లో ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలను తొలగించాలని కోరినా అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆలయ చైర్మన్‌‌ హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌ జూకంటి అనిల్‌‌కుమార్‌‌ ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదిస్తూ..ఇందిరాగౌడ్‌‌ అనే మహిళ 1.20 ఎకరాల ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారన్నారు.

ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని గతేడాది డిసెంబరులో వినతి పత్రం సమర్పించినా చర్యలు తీసుకోలేదన్నారు. దేవాదాయశాఖ తరఫు న్యాయవాది భూక్యా మంగీలాల్‌‌ నాయక్‌‌ వాదిస్తూ.. 2013లో సర్వే శాఖ సహాయ డైరెక్టర్‌‌కు సర్వే నిర్వహించి ఆలయ భూమిని గుర్తించాలని దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌‌  లేఖ రాశారన్నారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇందిరాగౌడ్‌‌ తరఫు న్యాయవాది వాదిస్తూ..ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం ఈ భూమిని తనతోపాటు ప్రైవేటు వ్యక్తులకు కేటాయించిందన్నారు.

వాదనలను విన్న న్యాయమూర్తి ఆలయానికి చెందిన 14.10 ఎకరాల భూమికి రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారులతో కలిసి సర్వే చేసి కంచె వేయించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ 12 వారాల్లో పూర్తి చేయాలంటూ తీర్పు వెలువరించారు.