- అధికారులను ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: సినిమా టిక్కెట్ ధరలను పెంచబోమని కోర్టు ముందు హామీ ఇస్తున్నప్పటికీ, కొత్త సినిమా విడుదలైనప్పుడల్లా రేట్లు పెంచుకోవడానికి అధికారులు అనుమతులు ఇస్తూనే ఉన్నారని హైకోర్టు పేర్కొంది. టిక్కెట్ ధరల పెంపును నిలిపివేస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, వాటికి విరుద్ధంగా ప్రభుత్వం మెమోలు జారీ చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించింది. సినిమా టిక్కెట్ ధరలను పెంచరాదన్న హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ‘పెద్ది’ సినిమా టిక్కెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ మెమో జారీ చేసిన హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ డి.చంద్రబాబు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ బుధవారం విచారణ చేపట్టారు.
2021లో జారీ చేసిన జీవో నం.120 ప్రకారం రాష్ట్రంలోని సినిమా థియేటర్లను వర్గీకరించి టిక్కెట్ ధరలను నిర్ణయించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ ఉత్తర్వులను అమలు చేయాల్సిన ప్రభుత్వం వాటికి విరుద్ధంగా పలుమార్లు ప్రత్యేక మెమోలు జారీ చేసి టిక్కెట్ ధరల పెంపునకు అనుమతించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఏదైనా పిటిషన్ కోర్టు ముందుకు వచ్చినప్పుడల్లా ఇకపై ధరలు పెంచబోమని ప్రభుత్వం హామీ ఇస్తున్నదని, అయితే కొత్త సినిమా విడుదలైన వెంటనే మళ్లీ ధరల పెంపునకు అనుమతులు ఇవ్వడం కొనసాగుతున్నదని న్యాయమూర్తి తప్పుపట్టారు. కోర్టు ఉత్తర్వుల అమలు విషయంలో ప్రభుత్వ వైఖరిపై వివరణ కోరారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు.
