హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు కంపెనీల ఫిర్యాదులను విచారించే అధికారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించిన ఫిర్యాదులపైనే కమిషన్ విచారణ జరపాలని, చట్టబద్ధ సంస్థలు తమ పరిమితుల్లోనే వ్యవహరించాలని పేర్కొంది. వెల్స్ ఫార్గో ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేసిన ఇద్దరు మహిళా ఉద్యోగుల వేధింపుల ఫిర్యాదుపై మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ విచారించి ఈ తీర్పు వెలువరించింది.
లైంగిక వేధింపుల నిరోధక చట్టం అమల్లో ఉందని, ప్రైవేటు సంస్థలపై ప్రభుత్వాల నియంత్రణ లేనందున ఎస్హెచ్ఆర్సీకి ఆదేశాలు జారీ చేసే అధికారం లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు కమిషన్‌లో పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను కొట్టివేసింది.
