హకీంపేట భూముల వేలానికి బ్రేక్‌‌

హకీంపేట భూముల వేలానికి బ్రేక్‌‌
  • సర్వే కోసం అడ్వకేట్ కమిషనర్ల నియామకం
  • కమిషనర్లు నివేదికను సమర్పించే వరకు వేలం ప్రక్రియ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: షేక్‌‌పేట మండలం హకీంపేటలోని 8.24 ఎకరాల భూముల వేలాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సర్వే నంబర్లు 102/2, 102/3లోని భూములు ప్రభుత్వానికి చెందినవా.. కావా..? అనే వివాదం నేపథ్యంలో ఇరుపక్షాల తరఫున ఇద్దరు అడ్వకేట్ కమిషనర్లను కోర్టు నియమించింది. ప్రభుత్వం తరఫున ఎన్‌‌. శ్రీధర్‌‌రెడ్డి, పిటిషనర్ల తరఫున శ్యామేశ్ అగర్వాల్‌‌ను కమిషనర్లుగా నియమిస్తూ.. రెవెన్యూ అధికారుల సహకారంతో సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

కమిషనర్ల నివేదిక అందేవరకు, జులై 2న హెచ్‌‌ఎండీయే నిర్వహించనున్న వేలాన్ని వాయిదా వేయాలని స్పష్టం చేసింది. హకీంపేటలోని ఈ భూములకు హెచ్‌‌ఎండీయే జారీ చేసిన వేలం నోటిఫికేషన్‌‌ను సవాల్ చేస్తూ యమునానగర్ హౌసింగ్ సొసైటీతోపాటు పలువురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై జస్టిస్ ఎన్‌‌వీ శ్రవణ్ కుమార్ మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ భూముల పేరుతో సొసైటీలు, ప్రైవేట్ వ్యక్తులకు చెందిన స్థలాలను వేలం వేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఈ భూములకు సంబంధించి గతంలో హైకోర్టు ఆదేశించిన సంయుక్త సర్వేను కూడా అధికారులు అమలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వేలం నోటిఫికేషన్ వెలువడిన వెంటనే పూర్తి వివరాలతో వినతిపత్రం సమర్పించినప్పటికీ, అధికారులు స్పందించకుండా వేలం ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది కాట్రం మురళీధర్‌‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సంబంధిత సర్వే నంబర్ల పరిధిలో సుమారు 323 ఎకరాల భూమి ఉందని, అందులో పట్టా, అసైన్డ్ భూములు కూడా ఉన్నాయని తెలిపారు.

హౌసింగ్ సొసైటీలకు కేటాయించిన భూములు, పేదలకు క్రమబద్ధీకరించిన స్థలాలను మినహాయించి, కేవలం ప్రభుత్వ భూమికే కంచె వేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములకే వేలం నిర్వహిస్తున్నామని కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రభుత్వం తన భూమిగా పేర్కొంటూ కంచె వేసిన ప్రాంతంలో సమగ్ర సర్వే నిర్వహించాలని ఆదేశించారు. అడ్వకేట్ కమిషనర్లు తమ నివేదికను సమర్పించే వరకు వేలం ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని వార్తలు