- దుండిగల్‌లో ఘటన..నిందితుడు అరెస్ట్
జీడిమెట్ల, వెలుగు: ఓ వ్యక్తి ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం సంపాదించాడు. అయినా, జల్సాలకు అలవాటు పడి డబ్బుకోసం తన సహోద్యోగి ఇంట్లోనే 40 తులాల బంగారు నగలను దొంగతనం చేశాడు. దుండిగల్ ఏరియాలో జరిగిన ఈ ఘటన వివరాలను కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన లక్ష్మీనారాయణ.. గడ్డపోచారంలోని ఒక ప్రముఖ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేసే సహోద్యోగి సునీలాతో అతనికి మంచి పరిచయం ఏర్పడింది.
వారిద్దరూ తరచూ ఆర్థిక విషయాలు మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో తన వద్ద భారీగా బంగారం ఉందని లక్ష్మీనారాయణకు సునీలా చెప్పింది. అప్పటికే బెట్టింగులు, జల్సాలకు బానిసై అప్పుల్లో ఉన్న లక్ష్మీనారాయణ.. ఆమె ఇంట్లో దొంగతనం చేయాలని ప్లాన్ వేశాడు. అనుకున్నట్లుగానే ఒకరోజు మధ్యాహ్నం భోజన సమయంలో సునీలా హ్యాండ్ బ్యాగ్ నుంచి ఇంటి తాళాలు దొంగిలించాడు. వెంటనే బైక్‌పై బౌరంపేట్‌లోని ఆమె ఇంటికి వెళ్లి, దర్జాగా తాళం తీసి బీరువాలోని 40 తులాల బంగారు నగలను కాజేశాడు.
తిరిగి కంపెనీకి వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా తాళంచెవిని మళ్లీ ఆమె బ్యాగులో పెట్టేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన సునీలా.. మధ్యాహ్నం ఎవరో వచ్చి వెళ్లినట్లు పొరుగువారి ద్వారా తెలుసుకుని బీరువా పరిశీలించగా బంగారం మాయమైనట్లు గుర్తించింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన దుండిగల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా లక్ష్మీనారాయణను నిందితుడిగా గుర్తించారు. కేవలం 12 గంటల్లోనే కేసును ఛేదించి, అతడి నుంచి 40 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
