హైదరాబాద్, వెలుగు: మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో నిర్వహించే సీఎం ప్రజావాణి కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్‌కు చెందిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు సందర్శించారు. ప్రజావాణిలో అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఆన్‌లైన్ ద్వారా సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తున్న తీరు అభినందనీయమని వారు కితాబిచ్చారు. ప్రజల సమస్యలను అధికారులు ఎంతో ఓపికతో వినడం, ప్రతి దరఖాస్తుకు రసీదు ఇవ్వడం, దరఖాస్తులపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ తెప్పించుకుంటూ నిరంతరం ఫాలోఅప్ చేయడం వంటి అంశాలు తమ వృత్తి జీవితానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ జి. చిన్నారెడ్డితో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రజావాణి అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణికి వచ్చే అర్జీలలో సమస్యల పరిష్కార రేటు 74 శాతంగా ఉందని చిన్నారెడ్డి వారికి వివరించారు. గల్ఫ్, ఇతర దేశాల్లోని తెలంగాణ కార్మికులు, ఎన్నారైల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రవాసి ప్రజావాణి అమలు తీరుపై కూడా ట్రైనీ అధికారులు ఆసక్తి కనబరిచారు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి ప్రవాసి ప్రజావాణి సాధించిన ప్రగతిని, ఎన్నారైల సమస్యలను పరిష్కరిస్తున్న విధానాన్ని వారికి వివరించారు.
