కొడుకును హత్య చేశారన్న కోపంలో.. నిందితుడి తండ్రిని చంపేసిన్రు

కొడుకును హత్య చేశారన్న కోపంలో.. నిందితుడి తండ్రిని చంపేసిన్రు
  • పాతకక్షల నేపథ్యంలో ఆటోతో ఢీకొట్టి యువకుడి హత్య
  • నిందితుడి తండ్రిపై మృతుడి బంధువుల దాడి
  • రాయి కట్టి చెక్ డ్యామ్లో పడేసి హత్య
  • మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో ఘటన

చిన్నశంకరంపేట/వెల్దుర్తి, వెలుగు: యువకుడిని చంపారని ఆగ్రహానికి గురైన అతడి కుటుంబ సభ్యులు, బంధవులు నిందితుడి తండ్రిని హత్య చేశారు. ఈ రెండు హత్యకు ఒకే రోజు జరగడంతో గ్రామంలో కలకలం చెలరేగింది. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారంలో సోమవారం రాత్రి జరిగింది. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన యాట శ్రీధర్ (25)కు, అదే గ్రామానికి చెందిన రణబోయిన ప్రభాకర్ తో గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ప్రభాకర్, మహేశ్, గణేశ్, ప్రశాంత్  కలిసి చేగుంట మండలం అనంతసాగర్ వద్ద ఆటోతో ఢీకొట్టి శ్రీధర్ ను హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీధర్​కుటుంబసభ్యులు, బంధువులు అనంతసాగర్ చేరుకొని ఆందోళనకు దిగారు. శ్రీధర్​ను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోలీసులు వారికి నచ్చజెప్పి శ్రీధర్ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా... శ్రీధర్​తండ్రి, బంధువులు సోమవారం రాత్రి తూప్రాన్ వెళ్లి తిరిగి వస్తుండగా.. ఓ దాబాలో రణబోయిన ప్రభాకర్ తండ్రి యాదగిరి (55) కనిపించాడు. 

దీంతో ఆగ్రహానికి గురైన వారు యాదగిరిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అతడు అపస్మారక స్థితికి చేరుకోవడంతో అతడి బాడీకి బండరాయి కట్టి వెల్దుర్తి మండల పరిధి కొప్పులపల్లి సమీపంలోని హల్దీవాగు చెక్​డ్యాంలో పడేశారు. దీంతో యాదగిరి చనిపోయాడు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.