రామాయంపేట, వెలుగు: మెదక్ జిల్లా రామాయంపేటలో ఈ నెల18న జరిగిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీ వీడింది. జల్సాలకు అలవాటు పడిన వృద్ధురాలి మనవడే డబ్బుల కోసం తన ఫ్రెండ్ తో కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన వివరాలను రామాయంపేట సీఐ సైదానాయక్ మంగళవారం వెల్లడించారు.
రామాయంపేట పట్టణానికి చెందిన దోమకొండ సాయమ్మ (60)కు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లు పెండ్లిళ్లు కాగా, కొడుకు వేరే ఇంట్లో ఉండగా సాయమ్మ ఒంటరిగా ఉంటోంది. ఈ నెల 18న ఆమె చనిపోవడంతో గుండెపోటుతో చనిపోయినట్లు భావించిన కుటుంబసభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
ఈ క్రమంలో మెడపై గాట్లు కనిపించడంతో అనుమానం వచ్చిన సాయమ్మ కొడుకు శ్యాం 21వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు... సాయమ్మ చనిపోయిన రోజు రాత్రి అదే ఇంట్లో చిన్న కూతురు లక్ష్మి కొడుకు విశాల్ ఉన్నట్లు గుర్తించారు.
దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. డబ్బులు, నగల కోసం తన ఫ్రెండ్ప్రశాంత్ తో కలిసికల్లులో మత్తు మందు కలిపి ఇచ్చామని, మత్తులోకి జారుకున్నాక గొంతు నులిపి చంపేసి కమ్మలు, ఉంగరం తీసుకున్నట్లు ఒప్పుకున్నారు. దీంతో విశాల్, ప్రశాంత్ ను అరెస్ట్ చేసి నగలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.
