జమ్ము కశ్మీర్ లో దాదాపు 30ఏళ్ల తర్వాత సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. కశ్మీర్ లోని పుల్వామా, షోపియాలలో సినిమా హాళ్లను ప్రారంభించిన జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.. ఇది కశ్మీర్ కు చారిత్రాత్మక దినమన్నారు. ఇలాంటి మాల్స్ ను ప్రతి జిల్లాలోనూ నెలకొల్పుతామని చెప్పారు. ఈ సందర్భంగా ఈ సినిమా హాళ్లను యువతకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతనాగ్, శ్రీనగర్, బందిపొర, గందర్ బల్, దోడా, రాజౌరి, పూంచ్ లాంటి ప్రాంతాల్లోనూ త్వరలో థియేటర్లు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.
వీటితో పాటు వచ్చే వారంలో కశ్మీర్ లో తొలి ఐనాక్స్ మల్టీ ప్లెక్స్ ప్రారంభం కానున్నట్టు మనోజ్ సిన్హా చెప్పారు. శ్రీనగర్ లోని సోమ్ వార్ లో ఇది ప్రారంభమవుతుందన్న ఆయన.. 520 సీట్ల సామర్థ్యంతో మూడు స్ర్కీన్లు కలిగిన థియేటర్ అందుబాటులోకి రానుందని తెలిపారు. ఇదిలా ఉండగా 1980వరకు కశ్మీర్ లో దాదాపు డజను థియేటర్లుండేవి. ఆ తర్వాత ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడంతో కాలానుసారంగా అవి మూసివేశారు. అలా1990 ప్రారంభంలో సినిమా హాళ్లన్నీ మూసేశారు. ఆ తర్వాత మళ్లీ సినిమా హాళ్లను తెరవాలని ప్రయత్నించారు. కానీ 1999లో శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో ఉన్న రీగల్ సినిమా హాల్ పై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేయడంతో ఆ ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. మళ్లీ 30ఏళ్ల తర్వాత.. అంటే తాజాగా కశ్మీర్ లో సినిమా హాళ్లు ఓపెన్ కావడంతో థియేటర్లకు మళ్లీ మహర్దశ రానుందని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
