దేవుడు వచ్చే ఏడాది చాన్స్ ఇస్తాడని ఆశిద్దాం!

దేవుడు వచ్చే ఏడాది చాన్స్ ఇస్తాడని ఆశిద్దాం!
  • పూరీ జగన్నాథుడి రథయాత్రపై సుప్రీం కోర్టు కామెంట్
  • ఈ ఏడాదికీ పూరీలో మాత్రమే నిర్వహించాలన్న ధర్మాసనం
  • ఒడిశా సర్కారు నిర్ణయాన్ని సమర్థించిన కోర్టు
  • వచ్చే ఏడాదికైనా దేవుడు పరిస్థితి చక్కదిద్దుతాడని ఆశిద్దామని వ్యాఖ్య

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో జగన్నాథుడి రథయాత్రను కేవలం పూరీలో మాత్రమే నిర్వహించాలని, రాష్ట్రంలో మరెక్కడా జరుపుకోవద్దని ఒడిశా రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేసింది. భారీగా గుంపు చేరితే కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. గతేడాది మాదిరిగానే కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ కొద్ది మంది భక్తులతో కేవలం పూరీ క్షేత్రంలోనే జగన్నాథుని రథయాత్ర జరుపుకోవాలని సూచించింది. పలువురు వ్యక్తులు, ఒడిశా వికాస్ పరిషత్ లాంటి సంస్థలు వేసిన పిటిషన్లపై మంగళవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. కరోనా నిబంధనలు పాటిస్తూ రథయాత్ర జరుపుకునేందుకు అన్ని ప్రాంతాల వారికీ అనుమతి ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. వారి వాదనను కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా సమర్థించారు. కరోనా ప్రోటోకాల్ పక్కాగా పాటిస్తూ, మాస్క్ పెట్టుకుని, ఫిజికల్ డిస్టెన్స్ ఫాలో అవుతూ అన్ని చోట్లా రథయాత్ర చేసుకోవచ్చని, అందుకు సుప్రీం అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అది సాధ్యం కాదని వాదించింది. జగన్నాథుడి రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని, వేర్వేరు ప్రాంతాల్లో జరిగే ఈ మహాయాత్ర ఏర్పాట్లను పర్యవేక్షించడం కష్టమని చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పూరీలో మాత్రమే రథయాత్రను నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొంది.
నేనూ ఏటా వెళ్తా: జస్టిస్ ఎన్వీ రమణ
వాదనలు విన్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దానితో ఏకీభవించింది. అన్ని పిటిషన్లను కొట్టేసింది. వచ్చే ఏడాదికైనా పరిస్థితులను దేవుడు చక్కదిద్దుతాడని ఆశిస్తున్నానని, అన్ని చోట్లా రథయాత్ర జరుపుకొనే అవకాశం కలుగుతుందని నమ్ముతున్నానని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ‘నేను కూడా ప్రతి ఏటా పూరీ వెళ్లి జగన్నాథుడిని దర్శించుకుంటాను. కానీ గడిచిన ఏడాదిన్నరగా వెళ్లడం కుదరలేదు. నేను ఇంట్లోనే ఆ దేవదేవుడిని పూజించుకుంటున్నాను. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే’ అని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొద్ది మందితోనే పూరీలో మాత్రమే రథయాత్ర నిర్వహించాలని, అది కూడా కరోనా నెగటివ్ రిపోర్ట్‌ వచ్చిన వారినే అనుమతించాలని ఆదేశించారు.