వీడియో: భయంకరమైన దృశ్యం.. కన్నీళ్లతో మైదానాన్ని వీడిన ఫుట్‌బాలర్

వీడియో: భయంకరమైన దృశ్యం.. కన్నీళ్లతో మైదానాన్ని వీడిన ఫుట్‌బాలర్

తొమ్మిదేళ్ల క్రితం ఆసీస్ యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూజెస్.. ఓ రాకాసి బౌన్సర్‌కు ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో భాగంగా న్యూ సౌత్ వేల్స్ ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్ వేసిన ఓ బంతి అతని ప్రాణాలు బలిగొంది. ఆ దృశ్యాలు ప్రతి క్రికెట్ ప్రేమికుడిని, ప్రతి క్రీడాకారుడిని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆ కోవకు చెందిందే ఈ కథనం. 

అనుకోకుండా జరిగిన ఘటనలో ప్రత్యర్థి ఆటగాడి కాలు కింద.. ఓ ఫుట్‌బాలర్ కాలు రెండు ముక్కలైంది. ఈ విషాద ఘటనతో సదరు ఫుట్ బాలర్, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు, ప్రేక్షకులు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటన కోపా లిబెర్ట‌డోర్స్ టోర్నీలో భాగంగా బ్రెజిల్ ఫ్లుమినెన్స్, అర్జెంటినోస్ జూనియ‌ర్స్‌ జట్ల మధ్య జ‌రిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. 

ఆట 56వ నిమిషంలో ఫ్లుమినెన్స్ జ‌ట్టు ఆట‌గాడు మార్సెలో అనుకోకుండా ప్రత్య‌ర్థి జ‌ట్టు ఆట‌గాడు అర్జెంటినోస్ డిఫెండ‌ర్ లుసియానో సాంచెజ్ కాలు తొక్కాడు. ఇది అనుకోకుండా జరిగిందైనా ఈ విషాద ఘటనలో లుసియానో కాలు కర్రలా వంగిపోయింది. సదరు ఫుట్ బాలర్ ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయాడు. నొప్పితో విల‌విల‌లాడిపోయాడు. వెంట‌నే వైద్య సిబ్బంది అప్రమత్తమై అతన్ని స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తరలించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఈ ఘటనలో లూసియానో కాలు విరిగిన‌ట్లు తెలుస్తోంది. అత‌ను కోలుకునేందుకు దాదాపు ఏడాదికి పైగా సమయం ప‌ట్ట‌నుంద‌ని స‌మాచారం. అయితే అతడు కోలుకున్నా.. మైదానంలో మునుపటిలా పరుగెత్తు గలడా అన్నది అసలు ప్రశ్న.