బిగ్‌బాస్ రివ్యూ : రోహిత్‌ త్యాగం ఊరికే పోలా.. !

బిగ్‌బాస్ రివ్యూ : రోహిత్‌ త్యాగం ఊరికే పోలా.. !

వారం గిర్రున తిరిగింది. వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఊపొచ్చే పాటకి హుషారుగా స్టెప్పులేస్తూ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. అంతే హుషారుగా కంటెస్టెంట్లకి క్లాసులు తీసుకున్నారు. కాంప్లిమెంట్లూ ఇచ్చారు. మరి ఆయన మెప్పు పొందినవారెవరు? ఇప్పటికీ ముప్పుకి దగ్గర్లో ఉన్నవారెవరు?

రోహిత్‌ త్యాగం ఊరికే పోలా!

హౌస్‌మేట్స్ ని  పలకరిస్తూనే నాగ్ కళ్లు రోహిత్‌ వైపు మళ్లాయి. అతను ఈవారం ఆట ఆడిన తీరుని ఆయన చాలా మెచ్చుకున్నారు. ముఖ్యంగా అతని త్యాగాన్ని ఎంతో ప్రశంసించారు. కొందరు నీ శాక్రిఫైస్‌ని తక్కువ చేయాలని చూస్తున్నారు కానీ అది నెక్స్ట్ లెవెల్, నువ్వు చాలా గ్రేట్ అని పొగడుతూ అతనిని తక్కువ చేసిన కొందరిపై సెటైర్ కూడా వేశారు. బ్యాటరీని రీచార్జ్ చేయడం కోసం రెండు వారాల పాటు తనని తాను నామినేట్ చేసుకున్నాడు రోహిత్. దానివల్ల చాలామందికి తమ ఇంట్లోవాళ్లతో మాట్లాడే, వాళ్లకి సంబంధించిన బహుమతుల్ని పొందే చాన్స్ వచ్చింది. అయితే వాళ్లలో ఎవ్వరూ రోహిత్‌కి ఏం కావాలో అడగకపోవడాన్ని నాగ్ తప్పుబట్టారు. అందరూ స్వార్థంగా ఉన్నారంటూ రోహిత్ బాధపడిన వీడియోని ప్లే చేసి మరీ అందరికీ క్లాస్ పీకారు. ఇప్పుడు మీలో తన కోసం ఎవరు త్యాగం చేస్తారో నిర్ణయించుకోండి అని ఆయన అనడంతో అందరూ నేనంటే నేనంటూ చేతులెత్తారు. దాంతో ఎవరు చేస్తే బాగుంటుందని ఆదిరెడ్డిని అడిగారు నాగ్. వాసంతిని సేవ్ చేసి అతను నామినేట్ అయ్యాడు కాబట్టి వాసంతి చేస్తేనే బాగుంటుందన్నాడు ఆది. అందుకు ఆమె కూడా ఒప్పుకుంది. నాగ్ ఆదేశం మేరకు రోహిత్ కోసం తన జుట్టును త్యాగం చేసింది. భుజాల వరకు కత్తిరించేసుకుంది. అయితే దీనివల్ల రోహిత్‌కి ఏం కలిసొచ్చిందని ఆదిరెడ్డి అడగడంతో.. వాళ్ల నాన్న మాట్లాడిన వీడియోని రోహిత్‌కి గిఫ్టుగా ఇచ్చారు నాగ్. 

అప్పట్లో గుడ్.. ఇప్పుడు డెడ్

ఈవారం టాస్కుల్లో ఎవరు ఎలా పర్‌‌ఫార్మ్ చేశారో జడ్జిమెంట్ ఇచ్చారు నాగ్. ఫైమా, సూర్యల ఆట తీరుకి గుడ్ ఇచ్చారు. బాలాదిత్య ఆటపరంగా గుడ్ అయినా, అతను తన త్యాగాన్ని చాలావరకు ఉపయోగించేసుకున్నాడు కాబట్టి యావరేజ్ అన్నారు. రాజ్‌కి యావరేజ్ ఇచ్చారు కానీ అతను తనకోసం తాను స్టాండ్ తీసుకోవడం మొదలుపెట్టడాన్ని మెచ్చుకున్నారు. కీర్తి తన ఆట గుడ్ అని ఫీలైనా యావరేజ్ మాత్రమే అన్నారు నాగ్. దాంతో ఎప్పట్లాగే ముఖం మాడ్చేసుకుంది. అది గమనించిన నాగ్ సుతిమెత్తగా క్లాస్ పీకారు. పోయినసారి కూడా ఇలాగే ఫీలైపోయావు, ఏం చెప్పినా ఆట బెటరవ్వాలనే, నీ కేపబిలిటీ తెలుసు కనుకనే దాన్ని బైటికి తీయడానికి చెబుతున్నానని క్లారిటీ ఇచ్చారు. వాసంతి అబౌ యావరేజ్ అని, కాస్త ప్రయత్నిస్తే గుడ్ అయిపోతుందని చెప్పారు. రేవంత్‌ గుడ్ గుడ్ గుడ్ అంటూ మూడుసార్లు నొక్కి చెప్పారు. శ్రీసత్యకి డెడ్ ఇస్తే ఆడియెన్స్ ఏమంటారు అనగానే అందరూ నో అని అరిచారు. నవ్వేసిన నాగ్ నువ్వు గుడ్ అని చెప్పారు. అర్జున్‌ని కాస్త పట్టించుకోమనండి, ఆ ఎంటర్‌‌టైన్‌మెంట్ మాకు నచ్చుతోంది అని ఆడియెన్స్ అనడంతో ఆయన పెద్దగా నవ్వేశారు. ఇక శ్రీహాన్ ఆట తీరు, మాట తీరు ఎప్పుడూ గుడ్డేనని అన్నారు. అయితే జరిగిపోయినదాన్ని ఎక్కువ క్యారీ చేయొద్దంటూ సజెషన్ ఇచ్చారు. అవకాశం లేని చోట కూడా ఎంటర్‌‌టైన్ చేసిన గీతూకి, అద్భుతంగా ఆడిన రోహిత్‌కి గుడ్ ఇచ్చారు. ఆది గుడ్ అయినా ఆటలో చిన్న తప్పు చేయడం వల్ల అబౌ యావరేజ్‌గా మిలిపోయాడన్నారు. మెరీనా గుడ్ అవడానికి దగ్గర్లో ఉందని, కాస్త ప్రయత్నిస్తే చాలని చెప్పారు. ఇనయా ఒక్కదాన్నీ మాత్రం డెడ్ అన్నారు నాగ్. ఒకప్పుడు నీ ఆట గుడ్, కానీ ఇప్పుడు డెడ్, మనుషుల మీద మానేసి ఆట మీద కాన్సన్‌ట్రేట్ చేయాలి అన్నారు. దాంతో ఇనయా ముఖంలో రంగులు మారాయి. మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పింది.

 

ఏది తప్పు? ఏది ఒప్పు?

ఇంట్లో వచ్చిన గిల్లికజ్జాలన్నింటికీ ప్రతి శనివారం ఫుల్‌స్టాప్ పెడుతుంటారు నాగ్. ఈసారి కూడా అదే చేశారు. ఆట విషయంలో ఫైమా, రేవంత్‌ల మధ్య వచ్చిన విభేదాన్ని పోగొట్టారు. పనిలో పనిగా రేవంత్ నిద్రపోతున్న వీడియోల్ని కూడా చూపించారు. కుక్కలు మొరిగినప్పుడల్లా ఉలిక్కిపడి లేచిందే కాక ఏదో ఆలోచిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చిన సంగతిని బట్టబయలు చేయడంతో అందరూ పడీ పడీ నవ్వారు. సూర్య, ఇనయా తనని సపోర్ట్ చేయలేదని అలిగిన ఫైమాకి కూడా ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారు నాగ్. ఎవరి సపోర్ట్ కోసం చూడొద్దు, బాగా ఆడుతున్నావ్, ఆడుతూ వెళ్లిపో అని మోటివేట్ చేశారు. ఇక ఆదిరెడ్డి, రోహిత్‌లు నామినేషన్ సమయంలో పడిన గొడవని కూడా లేవనెత్తారాయన. మెరీనా, ఆదిరెడ్డి మాట్లాడుకుంటున్నపుడు నువ్వు మధ్యలో ఎందుకు మాట్లాడావ్, ఆదిరెడ్డిని పర్మిషన్ అడిగావా అని రోహిత్‌ని అడిగారు. అతను అడిగానని చెప్పాడు. అదే విషయం ఆదిరెడ్డిని అడిగితే గుర్తు లేదన్నాడు. అయితే నేను గుర్తు చేస్తాను, నువ్వు పర్మిషన్ ఇచ్చావు, అందుకే అతను మాట్లాడాడు అంటూ స్పష్టం చేశారు. ఇక సూర్య ఎలిమినేషన్‌ గురించి కీర్తితో రహస్యంగా మాట్లాడటాన్ని నాగ్ తప్పుబట్టారు. అలా చేతుల మీద రాయడమేంటి, మాట్లాడుకోవచ్చు కదా అని కాస్త విసుగును ప్రదర్శించారు. ఇక మీదట ఇలాంటివి అనుమతించొద్దు అని బిగ్‌బాస్‌కి కూడా చెప్పారు. 

గీతూ నస.. ఫైమా గుసగుస

ఇవాళ సగం విషయం ఇంట్లోను, సగం విషయం కన్ఫెషన్ రూమ్‌లోను నడిపారు నాగ్. మొదట బాలాదిత్యను లోపలికి పిలిచి బిగ్‌బాస్‌కి, గీతూకి మధ్య జరిగిన సంభాషణని వినిపించారు. కానీ బాల తప్పుగా అనుకోలేదు. నాతో సిగరెట్లు మాన్పించేందుకే ఆమె అలా చేసింది, నా మంచి కోసమే అబద్ధమాడింది అని చెప్పాడు. ఆ తర్వాత ఫైమా నన్ను పిలవరా సర్ కన్ఫెషన్ రూమ్‌కి అని అడిగింది. సరే రా అని పిలిచిన నాగ్.. ఇంట్లో జరుగుతున్న ఇంటరెస్టింగ్ ఒకటి విషయం చెప్పమని అడిగారు. దాంతో సూర్య, ఇనయాల మధ్య జరుగుతున్నవ్యవహారం గురించి చెప్పిందామె. ఆ తర్వాత గీతూ కూడా కన్ఫెషన్ రూమ్‌కి వస్తానని అడిగింది. ఎవరికీ తెలియని విషయం చెబుతానంటే పర్మిషన్ ఇస్తానని నాగ్ అనడంతో చెబుతానంటూ లోపలికి వెళ్లింది. నువ్వు మా ఆయన్ని తిట్టడం నాకు నచ్చలేదని ఆదిరెడ్డి భార్య చెప్పడం తనకి బాధ కలిగించిందని, అతనెక్కడ దూరమైపోతాడోనని భయమేసి రాత్రి దుప్పటి కప్పుకుని బాగా ఏడ్చేశానని చెప్పింది గీతూ. ఆ తర్వాత అలవాటు ప్రకారం తెగ నస పెట్టింది. బిగ్‌బాస్ పాటించే పద్ధతులు భలే ఉంటాయి, నాకు చాలా నచ్చేస్తోంది, సీజన్ అయిపోయాక కూడా ఇక్కడికే వచ్చి పని చేయాలనిపిస్తోంది అంటూ ఏంటేంటో మాట్లాడింది. పొరపాటున కూడా చేర్చుకోవద్దని టీమ్‌కి చెబుతానంటూ సెటైర్ వేశారు నాగ్. ఇంకా ఏవేవో చెప్పింది. కట్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి జాగ్రత్తగా టాపిక్ కట్ చేసేశారు నాగ్. నువ్వు చాలా రూడ్‌గా మాట్లాడుతున్నావు, అది కరెక్ట్ కాదు, మాటతీరు మార్చుకుంటే మంచిది అని ఓ సలహా ఇచ్చి మరీ బైటికి తీసుకొచ్చారు.

చెప్పాలంటే ప్రతివారం కంటే ఈ వారం ఎపిసోడ్ కాస్త కూల్‌గానే సాగింది. ప్రతిదీ నవ్వుతూనే చెప్పారు తప్ప పెద్దగా కోప్పడలేదు నాగ్. చివర్లో శ్రీసత్యని సేవ్ కూడా చేశారు. మిగతా కథ రేపు కొనసాగుతుంది. డేంజర్ జోన్‌లో ఉన్న ఒకరి కోసం గేటు తెరచుకుంటుంది. ఈవారం సుదీప వెళ్లిపోతుందంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. నిజానికి సుదీప మంచి కంటెస్టెంటే. అయితే అన్ని విషయాల్లో బాగున్నా టాస్కుల విషయంలో వెనకబడుతోంది. అందుకే ఎలిమినేట్ అయ్యిందా? అసలు ఈ వార్త నిజమవుతుందా లేదా? నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం.