సొంత శాఖకు హౌసింగ్ ఉద్యోగులు..కార్పొరేషన్లలో డిప్యూటేషన్​పై 242 మంది

సొంత శాఖకు హౌసింగ్ ఉద్యోగులు..కార్పొరేషన్లలో డిప్యూటేషన్​పై 242 మంది
  • వంద మంది రిలీవ్.. హౌసింగ్ కార్పొరేషన్​లో రిపోర్ట్
  • ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ బాధ్యతలు అప్పగింత
  • రిలీవింగ్​కు టైమ్ ఇవ్వాలంటున్న జీహెచ్​ఎంసీ

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్​లలో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు మాతృ శాఖలో జాయిన్ అవుతున్నారు. 13 శాఖలు, 15 కార్పొరేషన్లలో ఉన్న 242 మంది ఉద్యోగులను వెంటనే రిలీవ్ చేయాలని సెప్టెంబర్ 26న ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ప్రారంభించనున్న నేపథ్యంలో డిప్యూటేషన్లు రద్దు చేయాలని హౌసింగ్ శాఖపై ఇటీవల జరిగిన రివ్యూలో సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో 242 మందిలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, పబ్లిక్ హెల్త్, వాటర్ బోర్డుల్లో పనిచేస్తున్న సుమారు వంద మంది ఇంజినీర్లు రిలీవ్ అయ్యారు. మిగిలిన వాళ్లు ఇంకా డిప్యూటేషన్​పైనే ఉన్నారు. రిలీవ్ అయినవాళ్లు హౌసింగ్ కార్పొరేషన్​లో రెండు రోజుల కింద జాయిన్ అవుతూ రిపోర్ట్ చేశారు. ఏ జిల్లాల్లో పోస్టింగ్ కావాలనేదానిపై వీరి నుంచి ఆప్షన్లు తీసుకున్నారు. ఒకట్రెండు రోజుల్లో వీరికి పోస్టింగ్ ఇవ్వనున్నారు. అయితే, కొంత మందికి మాత్రం ఇప్పటికే పోస్టింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం. 

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అప్లికేషన్లు, లబ్ధిదారుల ఎంపికలో సంబంధిత శాఖ అధికారులతో వీరంతా సమన్వయం చేసుకోనున్నారు. ఈ నెల 20 కల్లా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. దీంతో మిగిలిన వారిని వెంటనే రిలీవ్ చేయాలని త్వరలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లేఖ రాయనున్నట్లు తెలుస్తున్నది. కాగా, జీహెచ్ఎంసీలో సుమారు 70 మంది హౌసింగ్ కార్పొరేషన్ ఇంజినీర్లు, ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిని రిలీవ్ చేసేందుకు కొంత టైమ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం. తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాక వారిని రిలీవ్ చేస్తామని త్వరలో హౌసింగ్ మంత్రి పొంగులేటికి రిక్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తున్నది.