లాక్​డౌన్ లేకుండా కంట్రోల్..సౌత్ కొరియా స్పెషాలిటీ

లాక్​డౌన్ లేకుండా కంట్రోల్..సౌత్ కొరియా స్పెషాలిటీ

సియోల్​కరోనాపై యుద్ధంలో సౌత్ కొరియాకి ఒక ప్రత్యేకత వుంది. దాదాపుగా అన్ని దేశాల్లో లాక్ డౌన్ అమలవుతుంటే… దక్షిణ కొరియా మాత్రం ఆ కాన్సెప్ట్ కు దూరంగా వుంది. లాక్ డౌన్ ప్రకటించకుండానే కరోనా వైరస్ ను విజయవంతంగా కంట్రోల్ చేసింది.

ట్రేస్.. టెస్ట్.. ట్రీట్..

ట్రేస్.. టెస్ట్.. ట్రీట్.. ఈ మంత్రాన్ని పాటించి కరోనా మహమ్మారిపై పైచేయి సాధించింది సౌత్​ కొరియా. ‘గుర్తించు, పరీక్షించు, చికిత్స చెయ్’ అనే పద్ధతి కొరియన్ మోడల్ గా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కరోనాపై పెద్ద ఎత్తున టెస్టులు నిర్వహించింది. రోజుకు 18 వేల మందికి టెస్టులు చేసే సత్తా సౌత్ కొరియాకు వుంది. దీంతో మెజారిటీ జనాభాకి  టెస్టులు పూర్తి చేయించింది. పాజిటివ్ గా నిర్ధారణ అయినవారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించి  ట్రీట్​మెంట్​ చేయించింది. దీంతో కొవిడ్-19ని విజయవంతంగా కట్టడి చేయగలిగింది సౌత్ కొరియా.

డ్రైవ్ త్రూ… పద్ధతిలో…

కరోనా టెస్టులను కూడా చాలా సింపుల్ గా చేసింది.  వాహనాల పార్కింగ్ ప్రాంతాల దగ్గర మోడర్న్​ ఎక్విప్​మెంట్ తో హెల్త్ వర్కర్లను రెడీగా ఉంచింది. కారు ఆగగానే విండోలో నుంచే టెస్ట్ చేస్తున్నారు. కేవలం పది నిమిషాల్లోనే ఈ టెస్ట్ అయిపోతుంది. ఫలితాన్ని 2 రోజుల్లో మొబైల్​లో పంపుతారు. తేడా వస్తే క్వారంటైన్ సెంటర్​లో ట్రీట్​మెంట్​ చేస్తారు.

దాపరికం లేకుండా వైరస్ సమాచారం

కరోనా విషయంలో పూర్తి పారదర్శకతతో అక్కడి ప్రభుత్వం వ్యవహరించింది. వైరస్ తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పించింది. దీనితో ప్రజలు వాలంటరీగా టెస్టులు చేయించుకున్నారు. వైరస్ ను కంట్రోల్ చేయడం లో ప్రభుత్వానికి సపోర్ట్​ గా నిలిచారు.

మోడర్న్ టెస్టింగ్ కిట్స్

సౌత్ కొరియా దగ్గర మోడర్న్ టెస్టింగ్ కిట్స్ వున్నాయి. ఇదో ప్లస్ పాయింట్. చాలా తక్కువ టైంలో ఎక్కువ మందికి టెస్టులు చేయడంలో ఈ మోడరన్ టెస్టింగ్ కిట్స్ ఉపయోగపడ్డాయి.

ప్రజలు అర్థం చేసుకున్రు

కరోనా వైరస్ పై యుద్ధం లో ప్రజలకు అవగాహన కల్పించడమే ముఖ్యమని మన దేశంలో సౌత్ కొరియా రాయబారి షిన్ బోంగ్ కిల్ అన్నారు.  ఇండియా ప్రభుత్వానికి తాము ఇచ్చే సలహా ఇదే నన్నారు.   ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలతో షేర్ చేసుకోవాలన్నారు.  ఇండియా కోరితే తమ దగ్గర ఉన్న మోడ్రన్​ టెస్టింగ్ కిట్లను అందచేయడానికి సౌత్ కొరియా రెడీ గా ఉందన్నారు. మనదేశంలో ఇప్పుడు  15 వేలమంది కొరియన్లు వున్నారు. ఎక్కువమంది కొరియన్ కంపెనీలలో పని చేస్తున్నారు. వీరిని సొంత దేశానికి తీసుకెళ్లే ఆలోచన తమకు లేదని సౌత్ కొరియా రాయబారి షిన్ బోంగ్  చెప్పారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని  కేంద్ర ప్రభుత్వం  కరోనా పై చేస్తున్న యుద్ధం లో విజేతగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.