40 రోజుల్లో 19 వేల కోట్ల రుణమాఫీ ఎలా చేస్తారు

40 రోజుల్లో 19 వేల కోట్ల రుణమాఫీ ఎలా చేస్తారు
  • రుణమాఫీ ప్రకటనపై ఎక్స్​పర్ట్స్ సందేహాలు
  • 40 రోజుల్లో 19 వేల కోట్లు మాఫీ ఎట్ల.. 
  • నాలుగున్నరేండ్లలో మాఫీ చేసింది 6 శాతమే
  • చెల్లించింది రూ.37 వేల లోపు లోన్లు మాత్రమే
  • ఇంకా మాఫీ చేయాల్సింది రూ.19,198.38 కోట్లు
  • 31 లక్షల మంది రైతుల ఎదురుచూపు

హైదరాబాద్‌, వెలుగు: రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబర్​ రెండో వారంలోగా మొత్తం క్రాప్​లోన్లు మాఫీ చేస్తామని బుధవారం ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ 40 రోజుల్లో రూ.19 వేల కోట్లకుపైగా రుణాలు మాఫీ చేస్తుందా? లేక నామమాత్రంగా మాఫీ చేసుకుంటూ పోతూ ఎలక్షన్ల వరకు కాలం వెల్లదీస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

నాలుగున్నరేండ్లుగా కేవలం ఆరు శాతమే రుణాలు మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 94 శాతం రుణాలను ఇంత తక్కువ సమయంలో మాఫీ చేస్తామని చెప్పడంపై వ్యవసాయ, ఆర్థిక రంగ ఎక్స్‌పర్ట్స్‌ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈసారి రాష్ట్ర బడ్జెట్​లో కూడా ప్రభుత్వం రుణమాఫీ కోసం దాదాపు రూ.6 వేల కోట్లను మాత్రమే కేటాయించిందని గుర్తు చేస్తున్నారు.

మాఫీ చేసింది రూ.1,207 కోట్లే
2018 డిసెంబర్ 11వ తేదీని పంట రుణాల మాఫీకి కటాఫ్​గా రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఆ తేదీ నాటికి మొత్తంగా రూ.లక్ష వరకు లోన్ మాఫీ చేస్తామని ప్రకటించింది. 40.66 లక్షల మంది రైతులపై రూ.25,936 కోట్ల లోన్లు ఉన్నాయని బ్యాంకులు తేల్చాయి. అయితే, ఫ్యామిలీకి రూ.లక్ష మాఫీ తదితర రూల్స్ తో 3.98 లక్షల మందికి పైగా అనర్హులుగా తేలారు. మొత్తంగా 36.68 లక్షల మంది రైతులు అర్హులుగా గుర్తించారు. వీరిలో రూ.37 వేల లోపు రుణాలు ఉన్న 5.66 లక్ష మంది మాఫీ చేశారు. 

దీంతో ఇప్పుడు 31 లక్షల మంది రైతులకు చెందిన రూ.19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు దఫాలుగా చేయాలని సర్కారు నిర్ణయించింది. కాగా మొదటి దఫాగా రుణమాఫీ రూ.25వేల వరకు 2.96లక్షల మంది రైతుల రుణాలు రూ.408.38కోట్లు, రెండో దఫాలో 2.70లక్షల మంది రైతులకు 36వేల వరకు ఉన్న రూ.770.40 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఇతర కొన్ని సొసైటీల కు చెందినవి కూడా కలిపితే నాలుగున్నరేండ్లలో రూ.1,207 కోట్లు మాత్రమే మాఫీ చేశారు.