- రాయదుర్గంలోని ప్లాట్లకు క్రేజ్
- 11.38 ఎకరాల వేలానికి టీజీఐఐసీ నోటిఫికేషన్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) భూములకు మస్తు డిమాండ్ కనిపిస్తున్నది. నిరుడు అక్టోబర్‌లో ఎకరానికి రూ.177 కోట్లు పలికిన భూముల ధరలు.. అదే స్థాయిలో దూసుకుపోతున్నాయి. తాజాగా రాయదుర్గంలోని పన్మక్త భూములను టీజీఐఐసీ వేలం వేయడానికి దరఖాస్తులను ఆహ్వానించింది. రెండు రోజుల క్రితమే దానికి సంబంధించిన ప్రీ బిడ్ మీటింగ్ కూడా ముగిసింది.
అయితే, పలు సంస్థలు ఎకరాకు రూ.200 కోట్లు చెల్లించేందుకు ప్రీబిడ్ మీటింగ్‌లో ఆసక్తి కనబరిచినట్టు తెలిసింది. గతంలో అక్కడే వేలం వేసిన భూములను ఎకరాకు రూ.177 కోట్లు పెట్టి ఓ సంస్థ దక్కించుకున్నది. తాజాగా.. దుర్గంచెరువుకు దగ్గర్లోని ఐటీసీ కోహినూర్‌కు సమీపంలో ఉన్న పన్మక్త భూముల వేలానికి రెండు వారాల క్రితం టీజీఐఐసీ నోటిఫికేషన్ జారీ చేసింది.
సర్వే నెంబర్ 83/1లోని ప్లాట్ 1ఏ, 1ఎఫ్‌లోని 6.29 ఎకరాలు, ప్లాట్ నెంబర్ పీ4లోని 5.09 ఎకరాలు సహా మొత్తంగా 11.38 ఎకరాల భూముల వేలానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఎకరాకు రూ.139 కోట్లుగా అప్‌సెట్ ప్రైస్‌ను నిర్ధారించారు. ఈ వేలం ద్వారా రూ.2 వేల కోట్లకుపైగా ఆదాయం వస్తుందని టీజీఐఐసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్లాట్ నెంబర్ 1ఏ, 1ఎఫ్‌లోని భూములకు ఈ నెల 28న, ప్లాట్ నెంబర్ పీ4లోని భూములకు జూన్ 1న ఆన్లైన్లో వేలం నిర్వహించనున్నారు.
