అమెజాన్​ కన్నా ఆఫ్రికాలోనే కార్చిచ్చులు ఎక్కువ

అమెజాన్​ కన్నా ఆఫ్రికాలోనే కార్చిచ్చులు ఎక్కువ

అంగోలా, కాంగోలో కార్చిచ్చు ల తీవ్రత ఎక్కువని వెల్లడి
రోజూ అంగోలాలో 6,902.. కాంగోలో 3,395 కార్చిచ్చు లు
అమెజాన్ మంటలతో బ్రెజిల్ పిల్లలకు శ్వాస సమస్యలు
న్యు మోనియా, దగ్గు, ఆయాసంతో ఇబ్బందులు

నాసా రిపోర్ట్​.. శాటిలైట్​ ఫొటోలు విడుదల

ప్రపంచ దేశాలు అమెజాన్ కాలిపోతోందంటూ గగ్గోలు పెడుతున్నాయి. భూమి ఊపిరితిత్తులు మంటల్లో మసైపోతున్నాయంటూ ఆందోళన చెందుతున్నారు. కానీ, అంత కన్నా పెద్ద అగ్ని ప్రమాదం ఆఫ్రికాలో విరుచుకుపడుతోందన్న విషయాన్ని మాత్రం ఏ దేశమూ పట్టించుకోవట్లేదు. ఆఫ్రికాలో కార్చిచ్చులు అమెజాన్​ కన్నా ఎక్కువగా ఉన్నాయని నాసా వెల్లడించింది. దీనికి సంబంధించి నాసాకు చెందిన ఫైర్​ ఇన్ఫర్మేషన్​ ఫర్​ రీసోర్స్​ మేనేజ్​మెంట్​ సిస్టమ్​ (ఎఫ్​ఐఆర్​ఎంఎస్​) ఆఫ్రికా అడవులపై శాటిలైట్​ ఫొటోలను విడుదల చేసింది.

అంగోలాలో రోజూ 6,902, డెమొక్రటిక్​ రిపబ్లిక్​ ఆఫ్​ కాంగోలో 3,395 కార్చిచ్చు ఘటనలు జరుగుతున్నాయని వెల్లడించింది. అమెజాన్​తో (2,127)తో పోలిస్తే ఆఫ్రికాలో ఘటనల తీవ్రత ఎక్కువని హెచ్చరించింది. ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పిన నాసా, ఎంత మేర ఆ మంటలు వ్యాపించాయన్నది మాత్రం వెల్లడించలేదు. ఫొటోలను బట్టి చాలా ఎక్కువ ప్రాంతంలో కార్చిచ్చులు రేగినట్టు తెలుస్తోంది. వేలాది ఏళ్లుగా వ్యవసాయం కోసం పెడుతున్న నిప్పుల వల్లే ఆఫ్రికాలో మంటలకు కారణమని సమాచారం.

మిగిలిపోయిన పంట వ్యర్థాలు, కలుపు మొక్కలను రైతులు తగలబెడుతుండడంతో అడవులకు మంటలు అంటుకున్నాయని చెబుతున్నారు. ఇలా మంటపెడితే భూములు వ్యవసాయానికి అనుకూలంగా మారతాయని అక్కడి రైతులు భావిస్తున్నారని అంటున్నారు. 2016, 2017లలో ప్రపంచ వ్యాప్తంగా ఈ మంటల వల్ల అడవులు ఎక్కువగా కాలిపోయాయని నిపుణులు చెబుతున్నారు. ఈ శతాబ్దంలో ఆ రెండేళ్లలోనే ఎక్కువగా కార్చిచ్చు ఘటనలు రేగినట్టు చెబుతున్నారు.

బ్రెజిల్​లోని అమెజాన్​ అడవులు ప్రతి నిమిషానికి 870 చదరపు మైళ్ల మేర అడవులు తగలబడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. అమెజాన్​లో అయినా, ఆఫ్రికాలో అయినా మంటలు కేవలం రైతులు పెడుతున్న మంటల వల్లే అడవులు అంటుకుంటున్నాయంటున్నారు. ఇటు ఇండోనేషియాలోనూ వేలాది కార్చిచ్చు ఘటనలు రేగుతున్నట్టు నాసా చెబుతోంది. అమెజాన్​, కాంగోతో పాటు ఇండోనేషియా, బోర్నియోల్లోనూ అడవులు పెద్ద మొత్తంలో కాలిపోతున్నాయని చెప్పింది. 20 ఏళ్లలో ఈ కార్చిచ్చులు ఎక్కువయ్యాయని తెలిపింది.

బ్రెజిల్​కు ఊపిరాడట్లేదు

బ్రెజిల్​లో అమెజాన్​ అడవులు తగలబడిపోవడం వల్ల ఆ దేశంలో శ్వాస సంబంధ వ్యాధులు పెరిగిపోయాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు దగ్గుతో చాలా ఇబ్బంది పడుతున్నారని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు కేసులు ఎక్కువయ్యాయంటున్నారు. చాలా మంది శ్వాస కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నారని, కొందరికి ఆక్సిజన్​ పెట్టాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10 మధ్య రోజూ సగటున 120 నుంచి 130 దాకా శ్వాస సంబంధ సమస్యలతో కేసులు వచ్చాయి. కానీ, ఆగస్టు 11 నుంచి 20 దాకా అది 280కి పెరిగింది. పిల్లలను తీవ్రమైన పొడి వాతావరణం, పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చాలా మందికి న్యుమోనియా వచ్చింది. మరికొందరు పిల్లలు తీవ్రమైన దగ్గు, తెమడతో ఇబ్బంది పడుతున్నారు” అని రోండోనియాలోని కాస్మీ ఈ దామియా చిల్డ్రన్స్​ హాస్పిటల్​లో పనిచేస్తున్న చిన్న పిల్లల డాక్టర్​ డేనియల్​ పైర్స్​ చెప్పారు.

అర్జెంట్​గా అమెజాన్​ సదస్సు

అమెజాన్​లో రేగిన కార్చిచ్చులపై ఎమర్జెన్సీ అమెజాన్​ సదస్సును నిర్వహించాల్సిందిగా పెరూ, కొలంబియాలు ప్రతిపాదించాయి. అమెజాన్​ అడవులున్న దేశాలతో సదస్సు నిర్వహించాల్సిందిగా కోరాయి. సెప్టెంబర్​ 6న దీనిపై కొలంబియాలో సమావేశమయ్యేందుకు పెరూ అధ్యక్షుడు మార్టిన్ విజ్​కారా, కొలంబియా అధ్యక్షుడు ఇవాన్​ డ్యూక్యూలు నిర్ణయించారు. అమెజాన్​ ప్రాంతాన్ని కాపాడేందుకు ఆ అడవులున్న దేశాలన్నింటినీ ఒక్క తాటిపైకి తెచ్చేందుకు రెండు దేశాలు ప్రయత్నిస్తున్నట్టు వాళ్లు చెప్పారు. అయితే, బ్రెజీలియాలోని అమెజాన్ కో ఆపరేషన్​ ట్రీటీలోని దేశాల పేర్లను మాత్రం ప్రస్తావించలేదు.

అమెజాన్​ వర్షారణ్యాలకు ఈ మంట ‘పెను ముప్పు’లా పరిణమించిందని ఇంటర్నేషనల్​ ట్రాపికల్​ టింబర్​ ఆర్గనైజేషన్​ చీఫ్​ గెర్హార్డ్​ డైటర్లీ అన్నారు. ఇది ఎమర్జెన్సీ అని అన్నారు. ఈ కార్చిచ్చులు అమెజాన్​ సమగ్రతను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ఆ మంటలు ఎక్కువ ప్రాంతానికి వ్యాపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఆపకపోతే అమెజాన్​ అడవులు నాశనమైపోతాయని అన్నారు. కాగా, తాజా లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటిదాకా ఒక్క బ్రెజిల్​లోనే 82 వేల కార్చిచ్చు ఘటనలు చెలరేగాయి. పర్యావరణ మార్పులపై పోరాడడంలో ఇండియా కీలక భాగస్వామి అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్​ ఆంటోనియో గుటెరస్​ ప్రత్యేక ప్రతినిధి అన్నారు. వాతావరణ మార్పులపై పోరాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నారన్నారు.

వెలుగు మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి