భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌కు చెందిన మోడల్ ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త సమర్థ్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. 10 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న అతన్ని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ట్విషాను కట్నం కోసం వేధించారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ, సమర్థ్, అతని తల్లి, రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
న్యాయవాది అయిన సమర్థ్, మధ్యప్రదేశ్ హైకోర్టులో తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కొన్ని గంటలకే జబల్‌పూర్ కోర్టులో లొంగిపోయేందుకు వచ్చాడు. అయితే, భోపాల్ కోర్టులో లొంగిపోవాలని కోర్టు ఆదేశించడంతో, అక్కడే నిఘా ఉంచిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగింది..?
33 ఏళ్ల ట్విషా శర్మ ఈ నెల 12న భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన ఇంట్లో ఉరేసుకుని కనిపించింది. కట్నం కోసం అత్తింటివారు ఆమెను నిరంతరం వేధించేవారని, తీవ్రంగా అవమానించేవారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోస్ట్‌మార్టం సరిగా జరగలేదని, శరీరంపై ఉన్న గాయాలను నివేదికలో పేర్కొనలేదన్నారు.
రెండోసారి పోస్ట్‌మార్టం చేయాలని డిమాండ్ చేస్తూ.. మొదట ఆమె మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. అయితే, తాను ఈ పెళ్లి బంధంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, వేధింపులు ఎదుర్కొంటున్నానని ట్విషా చనిపోకముందు తన కుటుంబానికి, స్నేహితులకు తెలియజేసింది.
