నేతలు, కార్యకర్తలతో కిక్కిరిసిన సిటీ

నేతలు, కార్యకర్తలతో కిక్కిరిసిన సిటీ

హైదరాబాద్‌‌‌‌ : హైదరాబాద్‌‌‌‌ నగరం వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, జనంతో నిండిపోయింది. ర్యాలీలు, ఘన స్వాగతాలతో సిటీ కోలాహలం నెలకొంది. ఓ వైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతుండగా.. మరోవైపు ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికి ఘన స్వాగతంతో బిజీగా మారిపోయింది. దీంతో ట్రాఫిక్‌‌‌‌ పోలీసులు ఆంక్షలు విధించి, దారి మళ్లించారు. 

బీజేపీ జాతీయ సమావేశాలతో..
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నగరంలో నిర్వహిస్తున్నారు. శనివారం మోడీతో పాటు హోం మంత్రి అమిత్‌‌‌‌ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,  పార్టీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు హైదరాబాద్‌‌‌‌ చేరుకున్నారు. దీంతో వారికి ఘన స్వాగతం పలకడానికి బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలు తరలివెళ్లాయి. హైటెక్‌‌‌‌ సిటీలో సమావేశాలు, బస ఉండటంతో అక్కడి ప్రాంతాలు మరింత కిక్కిరిసిపోయాయి. ఆదివారం బహిరంగ సభ ఉండటంతో నగరం జనంతో ఇంకింత కళకళలాడనుంది.

టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ భారీ ర్యాలీలు..
ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌‌‌‌ సిన్హా కూడా శనివారం హైదరాబాద్‌‌‌‌ వచ్చారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. స్వయంగా సీఎం కేసీఆర్‌‌‌‌, మంత్రులు బేగంపేటకు వెళ్లి యశ్వంత్‌‌‌‌ కు వెల్‌‌‌‌కం చెప్పారు. 10వేల బైక్‌‌‌‌లు, కార్లతో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ర్యాలీలు నిర్వహించింది. బేగంపేట నుంచి జలవిహార్‌‌‌‌ వరకు బైక్‌‌‌‌లు, కార్ల ర్యాలీలతో జనం కిక్కిరిసిపోయారు.

ట్రాఫిక్‌‌‌‌కు తీవ్ర అంతరాయం
వీవీఐపీలు, బీజేపీ అగ్రనేతలు, ఆయా రాష్ట్రాల సీఎంలు, యశ్వంత్‌‌‌‌ సిన్హా పర్యటన, తెలంగాణ సీఎం కేసీఆర్‌‌‌‌ స్వాగతంతో సిటీలో ట్రాఫిక్‌‌‌‌కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌‌‌‌ పోలీసులు ముందుగానే ఆంక్షలు విధించారు. అనేక చోట్ల ట్రాఫిక్‌‌‌‌ దారి మళ్లించారు. హెచ్​ఐసీసీ, హైటెక్స్​ జంక్షన్, సైబర్ టవర్స్, మాదాపూర్, గచ్చిబౌలి, ఆర్సీపురం, చందానగర్‌‌‌‌, మియాపూర్‌‌‌‌, కొత్తగూడ, హఫీజ్‌‌‌‌పేట్‌‌‌‌, బేగంపేట, ఖైరతాబాద్‌‌‌‌, నెక్లెస్‌‌‌‌ రోడ్డు, ట్యాంక్‌‌‌‌ బండ్‌‌‌‌, మింట్‌‌‌‌ కాంపౌడ్‌‌‌‌ తదితర మార్గాల్లో మళ్లించారు. జేఎన్ టీయూ నుంచి సైబర్ టవర్స్ వైపు, మియాపూర్ నుంచి కొత్తగూడ వైపు, బయోడైవర్సిటీ నుంచి జేఎన్ టీయూ వైపు వాహనాలను అనుమతించలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాధారణంగానే సిటీలో మస్తు ట్రాఫిక్‌‌‌‌ ఉంటుంది.

ఎప్పట్లానే మెట్రో సేవలు 
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా మెట్రో సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని, ఎప్పట్లానే కొనసాగుతాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోడీ నోవాటెల్​లో ఉంటున్నం దున ఆ మార్గాల్లో నడుస్తున్న మెట్రో రైళ్లపై ఆంక్షలు ఉంటాయన్న వార్తలపై ఆయన స్పందించారు. శని, ఆదివారాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సాధారణ సమయ వేళలతో పాటు ఫ్రీక్వెన్సీ, స్టాపేజ్‌‌‌‌లు యాథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.