- కొన్ని చోట్ల దేవుళ్ల ఫొటోలు.. మరికొన్ని చోట్ల పిల్లల ఫొటోలు
- మరో చోట ఎడమ చేయి ఎత్తితే ఆడపిల్ల అని అర్థం
జనగామ, వెలుగు :స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ టెస్ట్‌లు చేయొద్దని ఆఫీసర్లు హెచ్చరిస్తున్నా, సెంటర్లను సీజ్ చేస్తున్నా నిర్వాహకులు మాత్రం మారడం లేదు. డబ్బుల కోసం, హాస్పిటల్స్ ఇచ్చే కమిషన్ల కోసం కడుపులో ఉన్నది అమ్మాయో.. అబ్బాయో చెప్పేస్తున్నారు. స్కానింగ్ సెంటర్లలో ఫొటోలు సహా ఎలాంటి చిహ్నాలు ఉండకూడదు. కానీ చాలా సెంటర్లలో సీతారాములు, పార్వతీపరమేశ్వరులు, బాల బాలికల ఫొటోలు పెడుతున్నారు. గైనకాలజిస్ట్ సూచించిన స్కాన్ మాత్రమే తీయాల్సి ఉండగా.. సెంటర్ల నిర్వాహకులు డబ్బుల కోసం లింగ నిర్ధారణ పరీక్షలు సైతం చేస్తున్నారు. కడుపులో ఉన్నది అమ్మాయో.. అబ్బాయో చెప్పేందుకు ప్రత్యేక సైగలు, కోడ్ లాంగ్వేజ్ వాడుతున్నారు. కడుపులో ఉన్నది అమ్మాయి అయితే హిందువులకు ‘సీత’ ఫొటో, ఇతర మతస్తులైతే వారి మతాలకు చెందిన ఆడవారి ఫొటోలను చూపుతున్నట్లు ఇటీవల జనగామలో అక్కడి డీఎంహెచ్‌వో అధికారులు గుర్తించారు. మరికొన్ని చోట్ల బాలికల ఫొటో చూపుతుండగా.. ఇంకా కొన్ని చోట్ల లెఫ్ట్ హ్యాండ్‌ను చూపిస్తున్నట్లు తెలిసి షాక్ అయ్యారు. ఈ కోడ్ విషయాన్ని గర్భిణికి ముందుగానే చెప్పేస్తుండడంతో.. సెంటర్ల నిర్వాహకులు చూపిన ఫొటోలు, సైగల ఆధారంగా కడుపులో ఉన్నది ఎవరో తెలిసిపోతోందని పసిగట్టారు.
గైనకాలజిస్ట్ సిఫార్స్ లేకున్నా స్కానింగ్
జనగామ జిల్లాలో పర్మిషన్ తీసుకున్న 146 హాస్పిటల్స్, 28 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే మరికొన్ని సెంటర్లు నడుస్తున్నాయి. గైనకాలజిస్ట్ సిఫార్సు ఉంటేనే గర్భిణికి స్కానింగ్ తీయాలి. గర్భం దాల్చిన 18 నుంచి -22 వారాల మధ్య తీసే టిఫా స్కానింగ్‌తో పిండం ఎదుగుదల, మెదడు, గుండె, వెన్నెముక, అవయవ నిర్మాణం, జెనెటిక్ లోపాలు తెలుసుకుంటారు. రెగ్యులర్‌గా గ్రోత్ స్కానింగ్, నెలలు నిండిన తర్వాత డెలివరీ నార్మల్‌గా అవుతుందా..? లేదంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందా ? అనే విషయం తెలుసుకునేందుకు సైతం స్కానింగ్ తీస్తారు. కానీ కొన్ని సెంటర్ల నిర్వాహకులు మాత్రం గైనకాలజిస్ట్‌ల సిఫార్సు లేకుండానే లింగ నిర్ధారణ టెస్ట్‌లు చేస్తున్నారు.
అబార్షన్ల కోసం స్పెషల్ ప్యాకేజీ..
కడుపులో ఉన్నది ‘అమ్మాయి’ అని తెలియగానే అబార్షన్ చేయించుకునేందుకు గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులు హాస్పిటల్స్‌కు వెళ్తున్నారు. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ పర్మిషన్ ఉన్న హాస్పిటల్స్‌లోనే అబార్షన్ చేయాలి. ఈ అనుమతి ఉన్న హాస్పిటల్స్ జనగామ జిల్లాలో పది కంటే తక్కువగానే ఉన్నాయి. గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్ రిపోర్ట్ ప్రకారం పిండం ఎదగకున్నా.. తల్లి ప్రాణానికి ప్రమాదమని తెలిసినా.. అబార్షన్ చేయొచ్చు. కానీ గర్భం ధాల్చిన 12 వారాల్లోపు టాబ్లెట్స్ ద్వారా, 24 వారాల్లోపు అయితే ఆపరేషన్ ద్వారా అబార్షన్ చేయాలి. అనుమతి ఉన్న హాస్పిటల్స్‌లో అబార్షన్ చేస్తే ‘అబార్షన్ ఎందుకు చేయాల్సి వచ్చింది’ అనే విషయాన్ని ఫారం ఎఫ్‌లో తెలపాల్సి ఉంటుంది. కానీ పలు హాస్పిటల్స్‌లో ఇష్టం వచ్చినట్లుగా అబార్షన్ చేస్తున్నారు. స్కానింగ్, అబార్షన్‌కు కలిపి ఒక్కో హాస్పిటల్లో రూ.30వేల నుంచి రూ.50వేల వరకు ప్యాకేజీ తీసుకుంటున్నారు.
