భారీష్ పూజల పేరిట అమాయక ప్రజలను ఉచ్చులోకి లాగి నిలువు దోపిడీ చేసే ఒక ముఠా గుట్టు రట్టు చేశారు షాద్ నగర్ పోలీసులు. డబ్బు ఇస్తే పూజ చేసి అదనంగా మరింత డబ్బు ఇస్తామని చెప్పి ఆశ చూపి మోసం చేశారు దుండగులు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఇటీవల జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. షాద్ నగర్ ఏసీపీ లక్ష్మి నారాయణ తెలిపిన వివారాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల గ్రామానికి చెందిన మక్బూల్ భాష అనే వ్యక్తి దొంగ స్వాముల చేతిలో మోసపోయాడు. మక్బూల్ కు అతని మిత్రుడైన కృష్ణ ద్వారా హైదరాబాదుకు చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. పది లక్షల రూపాయలతో షాద్ నగర్ కు వస్తే 30 లక్షల రూపాయలు ఇప్పిస్తామని నమ్మించాడు. ఎలా వస్తాయి అని ప్రశ్నిస్తే... గురుస్వాములు తమకు వచ్చే డబ్బులను మూడింతలు చేసి ఇస్తారని చెప్పాడు.
డబ్బులు అప్పనంగా, అదనంగా వస్తాయని గుడ్డిగా నమ్మిన మక్బుల్ భాష ఏప్రిల్ 2న 9 లక్షల రూపాయల బ్యాగుతో షాద్ నగర్ బస్టాండ్ దగ్గర దిగి సదరు వ్యక్తులకు ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న రామ్మోహన్, వేణు అనే వ్యక్తులు అతడిని కారులో పారడైస్ కాలనీకి తీసుకువెళ్లారు. వాళ్లు పెట్టిన లొకేషన్ వద్దకు చేరుకోగానే అక్కడికి బ్రహ్మయ్య అలియాస్ అన్నా రెడ్డి, రవి అలియాస్ మధు అనే వ్యక్తులు వచ్చారు. అంతలోనే అక్కడికి ముసుగులో వచ్చిన నలుగురు వ్యక్తులు మక్బూల్ భాషాను బెదిరించి అతని బ్యాగును లాక్కొని పారిపోయారు.
Also Read ; 3వేల 500 ఇస్తే కోరిక తీరుస్తానన్న హిజ్రా
పూజల పేరుతో మోసం చేశారని.. 9 లక్షల రూపాయలు కోల్పోయానని బాధితుడు షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న బ్రహ్మయ్య, మహేష్ లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో అసలు విషయాలు తెలుగులోకి వచ్చాయి.
మధు అనే వ్యక్తి నలుగురితో కలిసి ముఠాగా ఏర్పడి భారీష్ పూజల పేరుతో జనాలను మోసం చేస్తున్నట్లు విచారణలో తేలింది. పూజల పేరిట అమాయక జనాలను నమ్మించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడని వెల్లడించారు. నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. నిందితుల నుంచి ఆరు లక్షలతో పాటు ఒక స్కోడా కారు, రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.
