హైదరాబాద్ లో వందల ఎకరాల భూ కబ్జా... గూగుల్ మ్యాప్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది..!

హైదరాబాద్ లో వందల ఎకరాల భూ కబ్జా... గూగుల్ మ్యాప్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది..!

హైదరాబాద్ లోని ఐలాపూర్ తండాలో జరిగిన భారీ ప్రభుత్వ భూమి కబ్జాను గూగుల్ మ్యాప్స్ ద్వారా గుర్తించింది హైడ్రా. హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్లు ఉన్నప్పటికీ ప్రభుత్వ భూములను ముఖీం గ్యాంగ్ అక్రమంగా విక్రయించినట్లు గుర్తించామని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. పేద గిరిజనులకు 100 చదరపు గజాల ప్లాట్లుగా భూమిని అమ్ముతూ ముఖీం గ్యాంగ్ మోసం చేసినట్లు గుర్తించామని తెలిపారు కమిషనర్ రంగనాథ్. 

ప్రభుత్వ భూములను ప్లాట్లుగా విభజించి..

ముఖీమ్ గ్యాంగ్ కబ్జా బాగోతం గూగుల్ మ్యాప్స్ లో స్పష్టంగా కనిపిస్తోందని.. వందల ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు గుర్తించామని తెలిపారు. ప్రభుత్వ భూములను ప్లాట్లుగా విభజించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు ప్రాథమిక నిర్దారణ అయ్యిందని.. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ సాగిన అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కమిషనర్ రంగనాథ్.

గిరిజనులను మోసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని..మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి, ఆక్రమిత భూములను తిరిగి ప్రభుత్వాధీనంలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు కమిషనర్ రంగనాథ్. భవిష్యత్తులో ఇలాంటి భూకబ్జాలను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడతామని అన్నారు.

ముఖీంపై 19 క్రిమినల్ కేసులు: 

నిందితుడు ముఖీమ్ పై 19 కేసులు ఉన్నట్లు తెలిపారు రంగనాథ్. ప్ర‌జాప్ర‌తినిధుల‌తో స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగిస్తూ ప్ర‌భుత్వ భూమిని ఇష్టాను సారం అమ్ముకుని వంద‌ల కోట్లు పోగేసుకున్నాడని అన్నారు. మాధాపూర్‌ లో 12 ఎక‌రాల‌కు సంబంధించిన విష‌యంలో ముఖీం మీద మాదాపూర్ పీఎస్ లో మోస్ట్ న‌టోరియ‌స్ క్రిమిన‌ల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ముఖీంపైడ‌బుల్ మ‌ర్డ‌ర్ కేసుతో పాటు అటెంప్ట్ టు మ‌ర్డ‌ర్ కేసు కూడా నమోదైందని తెలిపారు.

ఎమ్మార్వోను బెదిరించినందుకు ఒక‌ కేసు న‌మోదైతే.. లే ఔట్‌లోని ప్లాట్లు చూడ‌డానికి వ‌చ్చిన వారిని బెదిరించారంటూ రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్లో మరో కేసు న‌మోదైందని..ముఖీం మీద ఉన్న కేసులతో అత‌ని గ‌న్  లైసెన్సును కూడా  పోలీసులు ర‌ద్దు చేశారని తెలిపారు. రాజ‌గోపాల్‌న‌గ‌ర్ కాల‌నీలో ముఖీం అమ్మేసిన ప్లాట్ల‌లో క‌ట్టిన ఇళ్ల‌ను, దుకాణాల‌ను మొత్తం 250 వ‌ర‌కూ అప్ప‌టి రెవెన్యూ అధికారులు 2023లో కూల్చేశారని అన్నారు.