- జూన్ రెండో వారంలో పరీక్షలు
- ఏటా2 సార్లు నిర్వహించేలా సర్కారు నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్) నిర్వహణకు విద్యాశాఖ రెడీ అయింది. ఈ నెల 13న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నది. జూన్ రెండో వారంలో పరీక్షలు నిర్వహించేలా అధికారులు ప్రాథమికంగా షెడ్యూల్‌ను రూపొందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగానే జనవరిలో పరీక్ష పూర్తికాగా, తాజాగా రెండో నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్కారు పచ్చజెండా ఊపింది. కాగా, పరీక్ష నిర్వహణపై శుక్రవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష తేదీలపై చర్చించారు. ఒకటీ, రెండు రోజుల్లోనే షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు.
టెట్ రాసేందుకు 30 వేల మంది టీచర్లు రెడీ
ఈ ఏడాది జనవరి 3 నుంచి 20 వరకు జరిగిన టెట్ పరీక్షలకు మొత్తం 1.95 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో లక్ష మంది (51.37%) అర్హత సాధించారు. పేపర్–-1లో 72%, పేపర్-–2లో 39.11% క్వాలిఫై అయ్యారు. అయితే, సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్లకు టెట్ తప్పనిసరి అయింది. జనవరిలో జరిగిన పరీక్షకు 67,605 మంది ఇన్ సర్వీస్ టీచర్లు హాజరవగా, వారిలో 37,893 మంది (57.76%) క్వాలిఫై అయ్యారు. దీంతో మరో 30 వేల మంది మాత్రమే టెట్ క్వాలిఫై కావాల్సి ఉంది. వారందరికీ మరో మూడు టెట్ పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంది. దీంతో ఈసారి టీచర్లు తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.
