జీవితానికి రెండే రెండు ప్రధాన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆరాటం.. మరొకటి పోరాటం. అన్ని సందర్భాల్లోనూ, అన్ని విషయాల్లోనూ ఆరాటమే. ఆశ, కోరిక, తపన- ఇలా ఎన్నో మూలాలున్నాయి. పొట్ట పోషించుకొనేందుకు పనిచేయడం, ఉద్యోగ వృత్తుల్లో నిమగ్నమవడం సమంజసమే. పదవులకోసం, డబ్బుకోసం, కీర్తికోసం దొడ్డిదారిన పాకులాడితే మనుగడకు అనర్థమవుతుంది.
జీవించడం అనేది ఒక కళ... ఆ కళ తెలిసినవాడు సుఖపడతాడు. తెలియనివాడు అగాధంలో పడిపోతాడు. అందుకే దుర్యోధనుడు అత్యాస వలన నానా కష్టాలు పడ్డాడు. మొదట్లో సుఖంగా బతికానని తాను అనుకున్నా.. ఎప్పుడు ఏదో ఒక ఆందోళనతోనే తన జీవితం గడిపాడు. కురక్షేత్ర యుద్ధంలో భీముడి చేతిలో తొడలు విరిగి పడివున్న దుర్యోధనుడు మరణించే ముందు తనతో పాటు ఏ శారీరక వస్తువునూ వెంటపెట్టుకొని వెళ్ళలేదు. కానీ అశ్వత్థామ పాండవుల ఐదుగురు కుమారుల తలలను తెచ్చి కానుకగా ఇస్తే, వాటిని చూసి సంతోషాన్ని, తృప్తిని మాత్రం తన చివరి క్షణాలలో మనసులో వెంటపెట్టుకొని ప్రాణాలు విడిచాడు.
అనంతకాలంలో మనిషి జీవితకాలం అతిస్వల్పం. వేదాంతపరంగా చెప్పాలంటే జీవితం క్షణ భంగురం. ఈ సత్యం తెలిసి కూడా సామాన్యుల నుంచి, రాజుల వరకూ ఏదో సాధించాలనే కోరికతో నిత్యం వెంపర్లాడుతూనే ఉంటారు.
మనిషి ఏడుస్తూ పుట్టాడంటే.. అందర్నీ ఏడిపించడానికి కాదు... ఆనందింప చేయడానికి..నవ్వించడానికి. పాపాలు నవ్వుతూ చేస్తే .. ఏడుస్తూ ఫలితం అనుభవించాలన్న సత్యం మనిషి గ్రహించడంలేదు. నూతిలో కప్ప అదే లోకం అనుకున్నట్లు- .. మనిషి తన భార్య, పిల్లలు బాగుంటే అదే సుఖమనుకుంటున్నాడు. సంఘ జీవినని మర్చిపోతున్నాడు. సమాజంతో, గ్రామంతో, రాష్ట్రంతో, దేశంతో, ప్రపంచంతో, లోకంతో ప్రేమానుబంధం పెంచుకోవాల్సిన బాధ్యత తనపైన ఉందనే విషయాన్ని గ్రహించడం లేదు.
సూది మొన మోపినంత భూమిని కూడా పాండవులకివ్వనన్న అహంకారి దుర్యోధనుడు వెంట ఏం తీసుకుపోయాడు.. మనిషి కన్నుమూస్తే ...అయ్యో పాపం.. అనిపించుకోవాలి. ..అమ్మయ్య.. శని వదిలింది అనిపించుకోకూడదు. అదే మంచి మరణం. ..ఎంతటి భక్తుడైనా.. అహంకారంతో కన్ను మిన్ను కనపడకుండా ప్రవర్తిస్తే .. . గర్వం సర్వం హరిస్తుంది. అప్పుడు మంచి మార్గంలో నడిచినా ఎలాంటి ఉపయోగం ఉండదు. పాప ఫలితం అనుభవించి తీరాల్సిందే నని పురాణాల ద్వారా తెలుస్తుంది.
ప్రస్తుత సమాజంలో ఎందరో అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఎన్నెన్నో బాధలూ కష్టాలు పడుతున్నారు. ఆపదలలో చిక్కుకొని రోదిస్తున్న వారికి సాయం చేయాల్సిన అవసరం ఇతరులకు లేదా..అన్న విషయంలో ప్రస్తుతం జనాలు పరోపకారార్థమిదం శరీరం... అన్న మాట ను గ్రహించడం లేదు.
సౌఖ్యానికి చిరునామా ఉంది.. . ధర్మవర్తనలో సుఖముంది. సక్రమార్జనలో సంతోషముంది. ..ప్రేమలో, సేవలో, త్యాగంలో, సంతృప్తి జీవితం ఉంటుంది. ప్రతిభను అభినందించి, ప్రోత్సహించడంలో ఆనందం ఉంది. మృష్టాన్న భోజనాన్ని కేవలం తానే ఆరగించడం కాదు.. పదిమందితో కలిసి పప్పుభోజనం తినడంలో సుఖముంది.
జీవితం ఓ అమూల్య గ్రంథం. దాన్ని చదివే ఆసక్తి ఉన్నవాడు, గ్రహించగలిగినవాడు విజేత అవుతాడు. మనం పుడితే.. తల్లి సంతోషపడాలి. పెరిగితే... తండ్రి గర్వపడాలి. బతికితే... సమాజం గౌరవించాలి. మరణిస్తే... శత్రువు కూడా కంటతడి పెట్టాలి. అదీ సుఖజీవనమంటే!
మనిషి గెలవవచ్చు...గర్వించకూడదు. .భయపడవచ్చు... పారిపోకూడదు. ఓడిపోవచ్చు.. కుంగిపోకూడదు. జీవితంలో ఇవన్నీ సహజమే.. సహించాలి. పదిమందికి ఉపయోగపడుతూ నడిస్తే బతుకంతా పాటలాగా సాగిపోతుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
